పిల్లలు.. పనుల్లో కాదనీ.. బడుల్లో ఉండాలని జిల్లా పోలీసు అధికారి అన్బురాజన్ తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వారి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. బుధవారం పోలీసు, ఐసీడీఎస్, కార్మిక, రెవెన్యూ, వైద్యశాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వేస్టేషన్, బస్టాండ్లు, పుట్‌పాత్‌లు, హోటళ్లు, దాబాలు, గ్యారేజీల్లో తనిఖీలు చేశారు. బాల కార్మికులను గుర్తించి కడప ఒకటో పట్టణ ఠాణాకు తీసుకొచ్చారు. బాలుర వద్దకు వెళ్లి వారితో ఎస్పీ మాట్లాడారు. ఎందుకు పనులకు వెళ్తున్నారని ప్రశ్నించగా కర్ఫ్యూ సమయంలో పాఠశాలలు లేవనీ, ఈ కారణంగానే పనులకు వెళ్తున్నామని పిల్లలు సమాధానం ఇచ్చారు.
వారి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు.. కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వ్యాపారులు, హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు. చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కడప డీఎస్పీ సునీల్, సీఐలు సత్యనారాయణ, నాగభూషణం, ఎస్సైలు, మధుసూదన్‌రెడ్డి, హసన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జమ్మలమడుగులోనూ ఎస్పీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
493 మంది బాల కార్మికుల గుర్తింపు..
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు చేశారు. వివిధ కర్మాగారాలు, గ్యారేజీ, హోటల్స్ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న 493 మంది బాల కార్మికులను గుర్తించారు. వారిలో 455 మంది బాలురు, 38 మంది బాలికలున్నారు. వారందరిని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదీ చదవండి: