సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. సీబీఐ మరొకరిని అరెస్టు చేసింది. సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన ఉమాశంకర్ రెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వరరెడ్డి సోదరుడు ఉమాశంకర్ రెడ్డిని కడపలో రోజంతా ప్రశ్నించిన అధికారులు.. అరెస్టు చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఉమాశంకర్ రెడ్డికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండు విధించింది. ఈనెల 23 వరకు ఉమాశంకర్ రెడ్డిని రిమాండ్‌లో ఉంచనున్నారు. ఈ మేరకు పులివెందుల నుంచి కడప జైలుకు నిందితుడిని తరలించారు.
రెండు నెలలగా ఉమా శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. తాజాగా వివేకా కారు డ్రైవర్ దస్తగిరి వారం కిందట సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అతని వాంగ్మూలం ఆధారంగానే ఉమా శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ కేసులో నెలకిందట సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరోవైపు సునీల్ యాదవ్ బంధువు భరత్ కుమార్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఇదీ చదవండీ.. BANKERS MEETING: బ్యాంకర్లతో సీఎం సమావేశం.. రుణ ప్రణాళికపై చర్చ