భూస్వరూపాల్లో వ్యత్యాసాలు, భూపంపకాలు, చిన్న కమతాలలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి హక్కుదారులందరికి శాశ్వత భూహక్కుపత్రాలను అందించేందుకే ప్రభుత్వం ‘మీ భూమి.. మా హామీ’ కార్యక్రమం చేపట్టిందని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మండలం కొక్కరాయపల్లెలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డితో కలిసి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గ్రామంలో రైతు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ఇది రైతు ప్రభుత్వమని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు నెల వ్యవధిలోనే ఆర్థికసాయం అందజేశామన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా 1.14 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో డ్రోన్లతో నిర్ధిష్టమైన కొలతలతో కూడిన ఛాయాచిత్రాలను అంతర్జాలంలో పొందుపరిచి హక్కుదారునికి శాశ్వత హక్కుపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వీతేజ్, ఎమ్మెల్యే, రవీంద్రనాథ్‌రెడ్డి, తహసీల్దారు అనూరాధ, గ్రామీణ సీఐ మహమ్మద్‌అలీ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: