కూరగాయల మార్కెట్ ను తరలించడానికి వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ అధికారులు.. కుట్ర పన్నుతున్నారని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద తెదేపా, కాంగ్రెస్, సీపీఐ, ప్రజాసంఘాలు వ్యాపారస్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయం ఎదురుగా ఉన్న పాత మార్కెట్ స్థానంలో.. మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మించాలని చూస్తున్నారన్నారు. తద్వారా ఎమ్మెల్యే కోట్ల రూపాయలను వెనకేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారని మండిపడ్డారు.
దాదాపు 5 వేల మంది పేదలకు.. కూరగాయల మార్కెట్ దశాబ్దాలుగా ఉపాధి కల్పిస్తోందని నేతలు పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ఇప్పుడు మోసం చేయడానికి వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికారులు ఇదే విధంగా ప్రయత్నిస్తే.. వ్యాపారులకు ఎమ్మెల్యే మద్ధతుగా నిలిచి పోరాడారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే తొలగించాలని చూడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మార్కెట్ తరలింపు ఆపకపోతే.. పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని.. డీఆర్వో మలోలాకు అఖిలపక్షం నాయకులు అందజేశారు.
ఇదీ చదవండి: బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ సీఐటియు నిరసన