Retired Woman Employee Handmade Toys: చాలా మంది వయసు మీద పడ్డాక ఒంట్లో ఓపిక లేక.. ఇంట్లోనే కాలం వెళ్లదీస్తుంటారు. ఏదో చిన్న చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కానీ ఈమె మాత్రం బొమ్మలు తయారు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఆమే కడపకు చెందిన రేణుక. ఈమె కడపలోని బాలసదంలో ఉద్యోగం చేస్తూ నాలుగు సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. ఉద్యోగం చేస్తున్నప్పుడే బ్రాహ్మణులు, వైశ్యుల పెళ్లిళ్లకు సంబంధించి ఎదురుకోళ్ల బొమ్మలను తయారు చేసేవారు. ఎవరింట్లో శుభకార్యమైనా రేణుక తయారుచేసిన బొమ్మలు ఉండాల్సిందే.
ఎదుర్కోళ్ల బొమ్మలు ఎన్ని రకాలంటే?: బ్రాహ్మణుల, వైశ్యుల పెళ్లిళ్లు జరగాలంటే తప్పనిసరిగా ఈ బొమ్మలు ఉండాల్సిందే. ఈ బొమ్మలు లేకుండా వారు వివాహాలు జరపరు. ఎదురుకోళ్ల బొమ్మలలో సుమారు 30 రకాల బొమ్మలు ఉంటాయి. ఏనుగులు, అమ్మవారి బొమ్మలు, నెమలి బొమ్మలు, కొబ్బరి పై శివుని పార్వతి బొమ్మలు, కలశం బొమ్మలు, ఉయ్యాల, గొడుగు, చక్కెర కేలి ఇలా ఉంటాయి. ఈ బొమ్మలన్నింటిని ఎంతో ఓపికతో రేణుక ఒక్కరే తయారు చేస్తుంటారు. ఎవరైనా వైశ్యులు, బ్రాహ్మణులు వివాహాలు చేసుకోవాలనుకుంటే 20 రోజుల ముందు ఆమెకు బొమ్మలు తయారు చేయమని ఆర్డర్ ఇస్తారు. కేవలం 15 రోజుల వ్యవధిలో అది కూడా చేత్తోనే ఈ బొమ్మలను తయారు చేస్తారు. ముఖ్యంగా కొబ్బరి పై బొమ్మలు వేయడం చాలా కష్టతరమైనప్పటికీ ఎంతో నేర్పుతో ఓపికతో రేణుక ఎంతో చక్కగా బొమ్మలను వేస్తుంటారు.
"గత 25సంవత్సరాల నుంచి ఈ బొమ్మలు తయారు చేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా వైశ్యులు, బ్రాహ్మణుల పెళ్లిళ్లకు ఈ బొమ్మలు కావాల్సిందే. పెళ్లి వాళ్లకు ఏ వస్తువు కావాలో ఆయా ధరకు వాటిని చేసి ఇస్తా ఉంటా. వాళ్ల కావాలని అనుకున్న టైంకు నేను వీటిని ఇస్తాను. ఎవరైనా ఈ బొమ్మలు కావాలి అనుకుంటే వారం ముందుగా ఆర్డర్ ఇవ్వాలి"-రేణుక, బొమ్మల తయారీ చేసే మహిళ
ఆదాయం ఎంతుంటే.. పెట్టుబడి కూడా అదే స్థాయిలో: 30 రకాల బొమ్మలను తయారు చేస్తే 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. కానీ పెట్టుబడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ బొమ్మలకు కావలసిన ముడి సరుకుల కోసం కడప లేదా బెంగళూరుకు వెళ్లాలి. ఈ వయసులో కూడా రేణుక వాటికి సంబంధించిన ముడిసరుకును తీసుకొచ్చి.. చేతితోనే వివిధ రకాల ఎదుర్కోళ్ల బొమ్మలను తయారు చేస్తారు.
అంతరించిపోతున్న కలను నలుగురుకు పంచడమే లక్ష్యంగా: తనకు ఓపిక ఉన్నంతవరకు ఇలాంటి బొమ్మలను తయారు చేస్తానని, ఎవరైనా వస్తే వారికి కూడా నేర్పించి తన కలను పలువురికి పంచుతానని రేణుక చెబుతున్నారు. ఇంటిపట్టున ఖాళీగా కూర్చోకుండా ఇలాంటి బొమ్మలు తయారు చేస్తే ఇంటి ఖర్చులకు నాలుగు డబ్బులు వస్తాయని, అలాగే అంతరించిపోతున్న ఇలాంటి కలలను పలువురికి పంచాలని అనుకుంటున్నట్లు రేణుక తెలిపారు. పెళ్లిళ్లకు రెడీమేడ్ సామాగ్రిని కొనుగోలు చేసేవారు ఎంతోమంది ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ ఎదుర్కోళ్ల బొమ్మలను చేతులతో తయారు చేయించి పెళ్లిళ్లకు ఉపయోగించడము హర్షించదగ్గ విషయం.
ఇవీ చదవండి: