Kadapa Crime News: కడప జిల్లా పోరుమామిళ్లలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నెపంతో షేక్ మున్నీ(30) అనే మహిళను నిర్బంధించి, హింసించి హత్యచేశారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను మంగళవారం ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఉదంతం సంచలనమైంది.
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్ మున్నీకి కలసపాడు మండలం రామాపురం గ్రామంలో ఓ వ్యక్తితో వివాహం కాగా కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. ఆమె ఏడాదిగా కడప జిల్లా పోరుమామిళ్లలోని సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నారు. అక్కడే గది అద్దెకు తీసుకుని తల్లి షకీలాతో ఉంటున్నారు. సూపర్‌మార్కెట్ యజమాని మాబు హుస్సేన్‌తో మున్నీ సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. మున్నీ ఐదు నెలల క్రితం సూపర్‌మార్కెట్‌లో పనిమానేసి.. గిద్దలూరులో ఉంటున్నారు. అయినప్పటికీ మాబు హుస్సేన్ కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యాయి. దీనంతటికీ మున్నీనే కారణమని భావించిన మాబు హుస్సేన్ కుటుంబసభ్యులు.. కానిస్టేబుళ్లు సయ్యద్, జిలానీలను వెంటబెట్టుకుని సోమవారం సాయంత్రం గిద్దలూరు వెళ్లారు. మున్నీ ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని పోరుమామిళ్ల తీసుకెళ్లారు. ఆమెను వాహనంలో ఎక్కించే సమయంలో కానిస్టేబుళ్లు కాళ్లతో తన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి తల్లి షకీలా పేర్కొన్నారు.
వాహనంలో మున్నీని కొట్టుకుంటూ తీసుకెళ్లిన కానిస్టేబుళ్లు ఆమెను మాబు హుస్సేన్ నివసించే వీధిలో పడేశారు. తర్వాత మరికొందరితో కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి గాయపరిచారు. ఆ గాయాలతోనే ఆమె మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాత నిందితులు... మున్నీని కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. హత్యోదంతంలో 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోరుమామిళ్ల సీఐ రమేష్‌బాబు తెలిపారు. నిందితుల్లో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ జాబితాలో ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లూ ఉన్నట్లు, అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కానిస్టేబుళ్లు సయ్యద్, జిలానీలను అరెస్టు చేస్తామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇదీ చదవండి: నెల్లూరులో భారీగా మద్యం బాటిళ్లు సీజ్...