Shortage of urea in Andhra pradesh:యూరియా కోసం అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు పొలం పనులు మానుకొని దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్న వైనం కనిపిస్తోంది. వచ్చిన నిల్వలను వచ్చినట్లే పంపిణీ చేస్తున్న అధికారులు.. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తామని చెబుతున్నారు. ఇలాగైతే నాలుగైదు ఎకరాలున్న వారు ఏం చేయాలనే ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ నేతలకు, సిఫారసులు ఉన్న వారికి యూరియా పంపిస్తున్నారనే ఆరోపణలు కొన్నిచోట్ల వినిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో కొన్నిచోట్ల నిల్వకు అవకాశం లేకపోవడం, ఇండెంటు పెట్టినా వెంటనే సరఫరా కాకపోవడంతో రెండు రోజుల తర్వాత రమ్మని కొన్నిచోట్ల రైతులకు చెబుతున్నారు.
జనవరిలో తగ్గిన యూరియా సరఫరా
జనవరికి సంబంధించి ఎరువుల సరఫరా తగ్గడంతోనే ఎరువుల కొరత తలెత్తింది. ముఖ్యంగా రాష్ట్రానికి సుమారు 50వేల టన్నుల యూరియా సరఫరా తగ్గింది. ఇది ఫిబ్రవరిలో రాష్ట్రానికి చేరింది. ఫలితంగానే రబీ కీలకమైన సమయంలో యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
దుకాణాల వద్ద బారులు తీరి
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కృష్ణారావుపేట సహకార పరపతి సంఘం పరిధిలో 380 బస్తాల యూరియా ఉంటే 200 మంది రైతులు వచ్చారు. అందరూ లైనులో నిలబడితే ఇస్తామని చెప్పారు. పోలవరం, తాళ్లపూడి, తాడేపల్లిగూడెం, దెందులూరు మండలాల్లో రైతులు ఎరువుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు, సీతానగరం, కడియం తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాలోనూ పలు చోట్ల రైతులు బారులు తీరుతున్నారు. వట్టిచెరుకూరు మండలంలో బహిరంగ మార్కెట్లోనూ దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. మేడికొండూరు మండలంలో బస్తా ధర రూ.350 వరకు పలుకుతోంది. గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తామని కొన్నిచోట్ల చెబుతున్నారు.
బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తోంది..
రబీ సీజన్‌లో జిల్లాకు సుమారు 8వేల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ప్రస్తుతం నాలుగున్నర వేల టన్నులు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ, మార్కెట్ ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అయితే మెట్ట ప్రాంతంలోని యూరియా నల్లబజారుకు తరలిపోతుండటం వల్ల కొరత పెరిగిందని రైతులు అంటున్నారు. బస్తా 266 రూపాయలు ఉండే ధర.. బ్లాక్ మార్కెట్‌లో 350నుంచి 400కు చేరిందని చెబుతున్నారు. ఆర్బీకేలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో యూరియా అందుబాటులో లేని సమయాల్లో బ్లాక్ మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తోందని రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్ ఆవేదన చెందుతున్నారు.
- ఆరు జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యం
'జనవరి లోటు కింద 49,736 టన్నులు, ఫిబ్రవరి కేటాయింపులో భాగంగా 20,500 టన్నుల యూరియా నౌకాశ్రయాలకు చేరింది. ఈ నిల్వలను తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యంపై.. సరఫరా చేస్తున్నాం. ఎరువులు సమృద్ధి గానే ఉన్నాయి. అయితే రైతు భరోసా కేంద్రాలకు గోదాములను సమకూర్చుకునే దశలో ఉండటంతో పంపిణీలో కొన్ని సమస్యలున్నాయి'. - హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ - అయిదెకరాల వరి.. నాలుగు బస్తాల యూరియా
‘అయిదెకరాల వరి సాగు చేస్తుంటే.. సొసైటీలో నాలుగు బస్తాల యూరియా ఇచ్చారు. అరెకరం ఉన్నా, ఎకరం ఉన్నా అందరికీ ఒకేలా యూరియా ఇస్తున్నారు. యూరియా కోసం ఇలా ఎదురు చూసే పరిస్థితి ఎప్పుడూ లేదు’ - సాపే వెంకట్రావు, ఊడిమూడి, తూర్పుగోదావరి జిల్లా - బస్తాకు రూ.400 ఖర్చు
‘ఎనిమిది ఎకరాల్లో వరి వేశాను. ఆర్‌బీకేకు వెళ్తే యూరియా అయిపోయిందంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా తీసుకోలేకపోయా. తెలిసిన రైతుల వద్ద మూడు బస్తాలు తీసుకుని చల్లాను. వాటిని తిరిగి ఇవ్వడానికి, మళ్లీ కొత్తగా చల్లడానికి 15 బస్తాలను ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేశాను. ఒక్కో బస్తాకు మొత్తం రూ.400 చొప్పున అయింది’ - తైలం పోశారావు, వేగేశ్వరపురం, పశ్చిమగోదావరి జిల్లా