కరోనా సృష్టిస్తున్న విలయతాండవం అంతా ఇంతా కాదు. కరోనా సోకి మరణించిన వారిని కడసారి చూద్దామన్నా తమవారికి కన్నీళ్లనే మిగులుస్తుంది. మృతదేహాలకు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో ఆఖరి చూపుకు కూడా కుటుంబ సభ్యులు నోచుకోలేకపోతున్నారు. కువైట్ నుంచి పశ్చిమగోదావరి వచ్చిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులను చేరుకోకుండానే మరణించిన దయనీయ పరిస్థితి ఇది. కనీసం ఆమె మృతదేహాన్ని చూసేందుకూ పిల్లలు, కుటుంబసభ్యులకు అవకాశం లేకుండా పోయింది.
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన మహిళ ఇటీవల కువైట్ నుంచి వచ్చారు. ఆమెను అధికారులు పాలకొల్లు క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. బుధవారం రాత్రి అస్వస్థతకు గురికాగా అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆమె గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.
ఆమె నమూనాలను సేకరించి మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. మృతదేహాన్ని కరోనా ప్రొటెక్షన్ కిట్ కవర్‌లలో ప్రత్యేకంగా భద్రపరచి అంబులెన్సులో స్వగ్రామానికి పంపించారు. అక్కడ అధికారుల సమక్షంలో ఖననం చేయనున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులున్నారు. తల్లిని కడసారిగానైనా చూడలేక పోయామని పిల్లలు తల్లడిల్లిపోతున్నారు.