పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని రైతులకు.. నెల రోజులుగా రబీ వరిచేలకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందకపోవడంతో.. ఈనిక, పొట్ట దశలోనే పంట ఎండు తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను అధికారులకు తెలియజేస్తున్న పట్టించుకోకపోవడంతో.. విసుగు చెందిన రైతులు వరి చేలోని వరి దుబ్బులను పట్టుకుని పాలకోడేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇస్తేనే అక్కడినుంచి వెళతామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో తమకు సాగునీరు అందకుంటే పురుగుల మందు తాగి మరణిస్తామని హెచ్చరించారు.
అధికారుల మల్లగుల్లాలు
ఉభయగోదావరి జిల్లాల్లోనూ, రాయలసీమలోని కేసీ కాలువ పరిధిలోనూ రబీ కింద సాగు చేసిన దాదాపు 11 లక్షల ఎకరాల ఆయకట్టు నీటి కోసం కటకటలాడుతోంది. దీన్ని గట్టెక్కించడం ఎలా అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గోదావరి కాలువలకు, వేసవిలో రక్షిత నీటి సరఫరాకు అవసరమైన నీటి నిల్వ కోసం ఏప్రిల్ 10 వరకు కాలువలను తెరిచి ఉంచాలని నిర్ణయించారు. అప్పటికి కూడా గోదావరి జిల్లాల్లో రబీ సాగు పూర్తవడం కష్టమే. ఆలస్యంగా సాగు మొదలుపెట్టడంతో కొన్నిచోట్ల మరో నెల్లాళ్ల వరకు కూడా నీటి అవసరాలు ఉంటాయని రైతులు చెబుతున్నారు.
రెండు లక్షల ఎకరాలకు అందని నీరు
మరోవైపు రాయలసీమలోని కర్నూలు, కడప కాలువ (కేసీ కెనాల్) కింద సాగులో ఉన్న రెండు లక్షల ఎకరాలకు సరిపడా నీరందడం లేదు. ప్రస్తుతం ముచ్చుమర్రి నుంచి 490 క్యూసెక్కులు, మల్యాల నుంచి 337 క్యూసెక్కులు మాత్రమే అందిస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లివ్వడం లేదు. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నుంచి 3.716 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తుంగభద్ర బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం కేసీ కాలువకు 8.057 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. కుడి గట్టు ఎగువ కాలువకు, తుంగభద్ర పుష్కరాలకు ఇచ్చినవి పోను మిగిలిన 3.716 టీఎంసీలను కేసీ కాలువ సాగు అవసరాల కోసం విడుదల చేయాలని లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో శనివారం తుంగభద్ర నుంచి కేసీ కాల్వకు 2,500 క్యూసెక్కులను విడుదల చేశారు.
గోదావరి.. మరీ తీసికట్టు
మరోవైపు గోదావరి సహజ ప్రవాహాలు తగ్గిపోవడంతో ఉభయగోదావరి జిల్లాల్లో 8.62 లక్షల ఎకరాల ఆయకట్టు విలవిల్లాడుతోంది. ఎగువ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల వల్ల గోదావరి ప్రవాహాలు దిగువకు రావడం లేదు. దీంతో సీలేరు జలాశయమే ఆధారమయింది. సీలేరులో విద్యుదుత్పత్తి ద్వారా 4,300 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇవి చాలక బైపాస్ ద్వారా మరో 3,200 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. ప్రస్తుత అవసరం తీరాలంటే 9వేల క్యూసెక్కుల వరకు నీరు కావాలి. ఇప్పటికే వంతుల వారీ విధానంలో ఉభయగోదావరి జిల్లాలకు నీళ్లు ఇస్తున్నా అవి చాలడం లేదు. డ్రెయిన్లపై అడ్డుకట్టలు నిర్మించి వాడుకున్న నీటిని పునర్వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 31 నాటికే పోలవరం వద్ద కాఫర్ డ్యాంను మూసివేస్తామని ఆలోపు రబీ సాగు పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు. మారిన పరిస్థితుల్లో ఏప్రిల్ 15 తర్వాతే కాఫర్ డ్యాం మూసివేసేందుకు అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: