పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 30 మందిని పరీక్షించగా వారిలో 14 మందికి పాజిటివ్, 10 మందికి నెగెటివ్ నివేదికలు రాగా మిగిలినవి అందాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన వారందరూ దిల్లీలో జరిగిన మతపర ప్రార్థనలకు వెళ్లినవారే. దీంతో అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు వచ్చినవారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకూ 28 మందిని గుర్తించినట్లు సమాచారం. ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. ఏలూరు, ఉండి, భీమవరం, నారాయణపురం, ఆకివీడు, పెనుగొండ, గుండుగొలను ప్రాంతాల్లో వారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ కావటంతో అధికారులు ఆ ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల మేర వైరస్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించారు. దిల్లీ నుంచి వీరు జిల్లాకు వచ్చి దాదాపు రెండువారాలు గడుస్తోంది. వీరంతా ఎక్కడికి వెళ్లారు..? ఎవరెవరిని కలిశారో తెలుసుకుంటున్నారు.
అప్రమత్తత అవశ్యం
కరోనా నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మార్పు రావాలి. జనతా కర్ఫ్యూ సమయంలో చూపించిన స్ఫూర్తి లాక్‌డౌన్ కొనసాగేంత వరకూ ప్రదర్శించాల్సి ఉంది. స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వైరస్‌ను కట్టడి చేయటం సుసాధ్యమని నిపుణులు ఉద్బోధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను విస్మరిస్తున్నారు. కొందరు ఆకతాయిలు అవసరం లేకున్నా రహదారుల వెంట తిరుగుతున్నారు.
ఇది ప్రమాద సంకేతంగా పరిణమిస్తోంది. జిల్లాలో జనసాంద్రత ఎక్కువగా ఉండే పట్టణాలైన ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం తదితర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకుంటే వారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదమే. ఇప్పటికే జిల్లాలో ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పారిశుధ్య సిబ్బంది సూపర్ శానిటేషన్ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: