గతంలో గిరిజనులు వెదురు వస్తువులు తయారు చేస్తూ ఉపాధి పొందేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక గిరాకీ తగ్గి ఉపాధి పోయింది. ప్లాస్టిక్ పెనుముప్పుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయమైన వెదురు వస్తువులపై అందరూ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ వస్తువుల తయారీ ఊపందుకుంటోంది.
ఐటీడీఏ సహకారంతో
పశ్చిమగోదావరి జిల్లాలో ఐటీడీఏ, ఏపీఎస్ఎస్డీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు వెదురు వస్తువుల తయారీ నేర్పిస్తున్నారు. నేటి కాలానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. అలంకరణ వస్తువులు, ఫర్నీచర్ తయారుచేసి ఆ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్. పురం ఐటీటీఏ కార్యాలయ ఆవరణలో 'గిరిజన యూత్ శిక్షణా కేంద్రం' పేరుతో శిక్షణా కేంద్రం ఏర్పాటుచేశారు. 2 నెలలపాటు సాగే ఈ శిక్షణలో ట్రెండ్‌కు తగ్గట్లు వెదురు వస్తువులు తయారు చేయడం.. వాటిని మార్కెటింగ్ చేసుకోవడంపై శిక్షణ ఇస్తారు. ఇలా దాదాపు 12 వందల మంది శిక్షణ పొందారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది
పశ్చిమగోదావరి జిల్లాలో కొండరెడ్డి తెగకు చెందిన గిరిజనులు అధికంగా ఉన్నారు. వీరికి వెదురు అందుబాటులో ఉంటుంది. అందుకే శిక్షణ కోసం వీరినే ఎంచుకున్నారు. వెదురుతో కుండీలు, బుట్టలు, లెటర్ బాక్స్, మొబైల్ బాక్స్, అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఖరీదైన రెస్టరెంట్లలో వాడే ఫర్నిచర్‌నూ వీళ్లు రూపొందిస్తున్నారు. ఈ వస్తువులు దేశంలో పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ వెదురు వస్తువులతో ప్లాస్టిక్ వాడకం కొంతవరకైనా తగ్గుతుందని గిరిజన యువత భావిస్తున్నారు.
ఇవీ చదవండి..