దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వ బుద్ధి మారాలని కోరుతూ పూజలు చేశారు. వైకాపా పాలనలో ఆలయాలకు రక్షణ కరవైందన్నారు.
అనంతపురం జిల్లా
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందువుల దేవాలయాలను కాపాడాలని, ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా
దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా విజయనగరం జిల్లా సాలూరులో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్ ఆధ్వర్యంలో సాయిబాబాకు పూజలు నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలోని రథంలో 3 సింహాలు చోరీకి గురికావడం దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. దీనిపై ఈవో నీళ్లు నమలడం దొంగలకు వత్తాసు పలకడమేనని ఆరోపించారు. ఆలయాల్లో చోరీలు, విధ్వంసాలు, అరాచకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..