లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు మరో విడత సరకుల పంపిణీకి పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మొదటి విడత రేషన్ పంపిణీ ప్రక్రియ ఈనెల 15తో ముగియనుంది. రెండో విడత సరకుల పంపిణీని ఈనెల 16 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. కార్డుదారులు చౌక ధరల దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చేసేందుకు కూపన్లను ముద్రించి గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా అందజేస్తారు. వీటిని ఆయా మండలాల పరిధిలోనే ముద్రించేలా అధికారులు చర్యలు చేపట్టారు. కార్డుదారులు సరకులు పొందాల్సిన తేదీ కూపన్లపై ముద్రిస్తారు. దాని ప్రకారం సరకులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈసారి శనగలు
ఒక్కో రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులకు రెండో విడత పంపిణీలో ఐదు కిలోల చొప్పున బియ్యం, కిలో శనగలు అందజేస్తారు. అంత్యోదయ అన్న యోజన కార్డు కలిగిన వారికి మొదటి విడతలో 35 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. రెండో విడతలో ఐదేసి కిలోల చొప్పున అందజేస్తారు. చౌకధరల దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు 2 నుంచి 3 వరకు అదనంగా కౌంటర్లను ఏర్పాటుచేస్తారు. మొదటి విడత రేషన్ సరకుల్లో కందిపప్పు ఉండగా ప్రస్తుతం శనగలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో తగినంత కందిపప్పు నిల్వలు లేనందున కార్డుదారులకు శనగలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
జిల్లాలో 12,59,925 రేషన్ కార్డుదారులున్నారు. రెండో విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీ నిమిత్తం జిల్లాకు 17 వేల టన్నుల బియ్యం అవసరం కాగా.. ఆ మేరకు సరకు జిల్లాలో అందుబాటులో ఉంది. ఇక 1260 టన్నుల శనగలను కర్నూలు నుంచి గూడ్స్ రైలులో తాడేపల్లిగూడెం తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి జిల్లాలోని మిగిలిన 13 ఎంఎల్‌ఎస్ కేంద్రాలకు తరలించామని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ దాసి రాజు తెలిపారు.
రెడ్ జోన్లలో ఇళ్ల వద్దకే సరకులు
'జిల్లాలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కార్డుదారుల ఇళ్ల వద్దకే రెండో విడత రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. మొదటి విడత రేషన్ సరకుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత కరోనా వైరస్ సోకిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో కార్డుదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాం. సరకులు పొందే కార్డుదారులు వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. సంబంధిత వీఆర్వో / వీఆర్‌ఏల గుర్తింపుతో సరకులను పంపిణీ చేస్తాం.' --- ఎన్.సుబ్బరాజు, జిల్లా పౌరసరఫరాల అధికారి
ఇవీ చదవండి: