పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 900 గ్రామ పంచాయతీల్లో 25 లక్షల మంది జనాభా ఉన్నారు. కలెక్టర్ ఆదేశాలతో 38 గ్రామ సచివాలయాల పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక శుభ్రతలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదన జరుగుతున్నాయి. జిల్లాలో 2, 800 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు డీఎల్‌పీవోలు, ఈఓపీఆర్‌డీలు, పంచాయతీ కార్యదర్శులు, మేస్త్రిలు, సూపర్‌వైజర్లు తదితర సిబ్బంది మొత్తం 1,100 మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
ఇప్పటికే 7.70 లక్షల మీటర్లు డ్రెయినేజీల్లో మలాథియన్, ఎబేట్ రసాయనాలు చల్లించారు. జిల్లాలో సుమారుగా ఐదు లక్షల కిలోల ముగ్గు, 1.20 లక్షల కిలోల క్లోరిన్‌ను ఉపయోగించారు. ఎనిమిది వేల లీటర్ల ఫినాయల్, ఐదు వేల లీటర్లు మలాథియాన్ పిచికారీ పూర్తి చేశారు. జిల్లాలో 2,200 ఓహెచ్‌ఆర్ ట్యాంకులను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేశారు.
చేతిపంపుల వద్ద క్లోరినేషన్
జిల్లాలో అన్ని పంచాయతీల పరిధిలోని చేతి పంపులు, ప్రైవేటు కుళాయిలను గురువారం శుభ్రం చేయించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రత్యేక కంట్రోల్ సెల్ ఏర్పాటు
కలెక్టర్ రేవు ముత్యాలరాజు సారథ్యంలో కరోనాపై పటిష్ఠ చర్యలు చేపట్టామని జిల్లా పంచాయితీ అధికారి తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా, ఇతర వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీఆర్‌సీ సమన్వయకర్త ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య సెల్ ఏర్పాటు చేశామని తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ పెర్కొన్నారు.
ఇదీ చదవండి: