పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన పోతప్రగడ బాలసాయిశ్రీ సాహితీ వినూత్నకు సాహస బాలలు-2020 పురస్కారం దక్కింది. వినూత్న ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారు. ఎన్‌సీసీ క్యాడెట్ అయిన వినూత్న గత ఏడాది భీమవరం డీఎన్నార్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. బహుమతుల ప్రదానోత్సవాన్ని 2020 జనవరి 25న ఏలూరులో నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆర్టీసీ బస్సులో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆమె స్వస్థలానికి బయలుదేరారు. ఆ బస్సు కృష్ణా జిల్లా కైకలూరు సమీపాన ఆలపాడు వద్ద ప్రమాదానికి గురై పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆ సమయంలో 42 మంది బస్సులో ఉన్నారు. విపత్కర పరిస్థితుల్లో వినూత్న బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి తన స్నేహితురాలు, ఒక ఉపాధ్యాయిని, మరో ముగ్గురు వృద్ధులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. వినూత్న ధైర్య సాహసాలను గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయిని నిర్మలాదేవి సాహసబాలల అవార్డు కోసం ప్రతిపాదనలు పంపారు.
ఈ మేరకు ఆమెకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఈమెయిల్ ద్వారా సమాచారం అందినట్లు ఆమె తండ్రి రమేష్ తెలిపారు. సాహస బాలల అవార్డుకి వినూత్న ఎంపిక ఎంపిక కావడంతో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్