పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో ఏకంగా రూ.7,823.13 కోట్లకు కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ (ఆర్‌ఈసీ) దాదాపు ఏడాదిపాటు పరిశీలన జరిపి వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం రూ.47,725.74 కోట్ల మేరకు సవరించిన అంచనాలు ఖరారు చేసింది. దిల్లీలో శుక్రవారం ఆర్‌ఈసీ సభ్యులు సమావేశమై పోలవరం తుది అంచనాలు ఖరారు చేశారు. ప్రధానంగా ప్రాజెక్టు పునరావాసం.. ఆ తర్వాత కుడి, ఎడమ కాలువల పనుల వ్యయంలోనే కోత విధించారు. 2017-18 ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపింది. వీటిని కేంద్ర జలసంఘం దాదాపు ఏడాదిన్నరపాటు పరిశీలించి, అనేక ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత సాంకేతిక సలహా కమిటీకి పంపింది. ఆ కమిటీ 2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇది ఆర్‌ఈసీ పరిశీలనలో ఉంది. ఏడాది తర్వాత ఇప్పుడు కొలిక్కి వచ్చింది. పోలవరం అంచనాలు ఖరారు చేయడంలో కీలకమైన రెండు కమిటీల ఆమోదమూ పూర్తవడంతో వీటికి ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడమే తరువాయి. ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో దాదాపు రూ.5000 కోట్ల మేర పునరావాస వ్యయంలోనే కోత పడినట్లు సమాచారం. పోలవరం కుడి, ఎడమ కాలువలకు సంబంధించి పని పరిమాణం విషయంలో కమిటీ ప్రశ్నలకు ఇంజినీర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో దాదాపు రూ.2,800 కోట్ల వరకు ఆ పనుల్లో కోత విధించినట్లు సమాచారం.
వ్యయ అంచనాల్లో మార్పులు ఇలా..
- 2005-06 ధరల ప్రకారం తొలుత అంచనాలు: రూ.10,151.04 కోట్లకు ఆమోదం
- 2010-11 ధరల ప్రకారం అంచనాలు: రూ.16010.45 కోట్లకు ఆమోదం
- 2017-18 ధరల ప్రకారం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.55,548.87 కోట్లు
- ప్రస్తుతం సవరణ కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.47,725.74 కోట్లు.