రహదారులు.. అభివృద్ధికి చిహ్నాలని అంటారు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రహదారులు.. రాతి యుగాన్ని తలపిస్తున్నాయి. జిల్లాలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రహదారులు అడుగడుగునా గోతులమయమై.. వాహన చోదకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాదారులు రెండు, మూడు అడుగుల గోతుల్లో పడి.. పలువురు మృత్యవాతపడగా... అనేకమంది క్షతగాత్రులయ్యారు.
ఆరు నెలల కాలంలో జిల్లాలో రహదారి ప్రమాదాల్లో 46మంది మృత్యువాతపడ్డారు. 178మంది గాయపడ్డారు. జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలు దేశంలోనే ముందువరుసలో నిలుస్తాయి. రికార్డుస్థాయిలో పండే ధాన్యం, విదేశాలకు రొయ్యలు.. ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి ఈ రహదారులపైనే సాగాలి. ఛిద్రమైన రహదారులతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. పశ్చిమగోదావరి డెల్టాలో ఏలూరు నుంచి నరసాపురం వెళ్లే 110కిలోమీటర్ల రహదారి.. ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తోంది. ఏలూరు నుంచి కైకలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, పాలకొల్లు మీదుగా నరసాపురం వెళ్లే ఈ రహదారి గోతులతో నిండిపోయింది. ఏలూరు నుంచి భీమవరం 65 కిలోమీటర్ల ప్రయాణం నాలుగు గంటల అవుతోందని వాహన చోదకులు అంటున్నారు. గతంలో గంటన్నరలో వెళ్లే వారమమని ప్రస్తుతం ఈ రహదారిలో వాహనం నడపడమే ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు..
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ఉన్న వందల కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయి. సుమారు 2135 కిలోమీటర్ల మేర రహదారులు జిల్లాలో ఉంటే.. వీటిలో 75శాతం రహదారులు దెబ్బతిన్నాయి. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, పాలకొల్లు నుంచి తణుకు, అత్తిలి, తాడేపల్లిగూడెం, భీమవరం-నారాయణపురం రహదారుల అధ్వానంగా మారాయి. వర్షాలకు గోతులు ఏర్పడి నీరు నిలుస్తోంది. ఈ నీటిలోనే వాహనాలు నడపడం వల్ల.. రహదారులు మరింత దెబ్బతింటున్నాయి. వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని రహదారులు మరమ్మతు చేసి.. ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి