పశ్చిమగోదావరి జిల్లాలో రేషన్‌కార్డుదారుల కష్టాలు తీరడం లేదు. సర్వర్ల మొరాయింపు, ఒక్కొక్క వినియోగదారుడు రెండుసార్లు వేలి ముద్ర వేయడం వంటి కారణాలు పంపిణీ ఆలస్యానికి కారణం అవుతోంది. రేషన్ పంపిణీలో రాష్ట్రంలోనే మొదటి రెండు, మూడు స్థానాల్లో ఉండే పశ్చిమ గోదావరి జిల్లా నిన్నటి వరకు జరిగిన పంపిణీ లెక్కల ప్రకారం పదో స్థానానికి చేరింది.
జిల్లాలో 12లక్షల83వేల678 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ఇప్పటివరకు 7,45, 201 మందికి(57.63 శాతం) మాత్రమే సరుకులు పంపిణీ చేయగలిగారు. ఈ నెల మూడో తేదీ నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైనా... సర్వర్ల సమస్య ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది వినియోగదారులకు పంపిణీ చేయలేకపోయారు. మరోవైపు పౌరసరఫరాల శాఖ మార్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి వినియోగదారునికి కార్డును రెండుసార్లు నమోదు చేసి రెండుసార్లు వేలిముద్ర వేయించాల్సి రావడంతో మరింత ఆలస్యం అవుతోంది.
వాస్తవానికి ఇప్పటికే రేషన్ పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా, 57 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరగడంతో ఈనెల 15వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రస్తుతం పంపిణీ జరుగుతున్న తీరును బట్టి గడువు తేదీ నాటికి కూడా పంపిణీ పూర్తయ్యే అవకాశాలు లేవని డీలర్లు అంటున్నారు. నెలకు రెండు విడతలు రేషన్ పంపిణీ చేయాల్సి ఉండటంతో... 25 రోజులకుపైగా రేషన్ దుకాణాలకు పరిమితం కావాల్సివస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: