రాష్ట్రంలో అరటి రైతులు విలవిలలాడుతున్నారు. శ్రావణంలోనూ ధర లేక గగ్గొలు పెడుతున్నారు. కరోనా విజృంభిస్తున్నందున ఇతర రాష్ట్రాల్లోనూ గిరాకీ తగ్గింది. దీంతో ఎగుమతుల్లేక అరటి రైతు కలత చెందుతున్నాడు. పైగా ఉన్న పంట కాస్త పెనుగాలులతో నేలమట్టమయ్యాయి.
పెట్టిన పెట్టుబడులు కూడా రావని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. సాగుకు పెట్టిన పెట్టుబడికి, వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. గత ఏడాది శ్రావణ మాసంలో అరటి గెల రూ. 350 నుంచి రూ. 400 వరకు విక్రయించగా లాక్‌డౌన్‌కు ముందు అరటి గెల రూ. 200 వరకు ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 80 కూడా పలకడం లేదని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని పలువురు రైతులు వాపోతున్నారు.
●జిల్లాలో సాగు విస్తీర్ణం - 15 వేల ఎకరాలు
●సాగయ్యే రకాలు : కర్పూర, చక్రకేళి, బుసావళి, బొంత
●ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు : ఉండ్రాజవరం, పెరవలి, ముక్కామల, ఖండవల్లి, తీపర్రు, కానూరు, కలవచర్ల, సిద్ధాంతం, వెలగదుర్రు, చివటం, తాడిపర్రు, నిడదవోలు, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, కొవ్వూరు
●గతంలో రోజుకు ఎగుమతులు : సుమారు 400 టన్నులు
●ప్రస్తుతం జరుగుతున్నవి : లేవు
●ఎగుమతి చేసే ప్రాంతాలు : కోల్‌కతా, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగ
పెట్టుబడులు రావడం లేదు...
నేను ఎకరం పొలంలో కర్పూర రకం అరటి సాగు చేస్తున్నాను. ఎకరానికి రూ. 90 వేలు పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. కరోనాతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఎగుమతులు నిలిచిపోయాయి. మొక్కకు రూ. 200 వరకు పెట్టుబడి పెట్టి గెలను మార్కెట్‌కు తరలిస్తే కనీసం రూ. 80 కూడా రావడం లేదు. అరటికి సపోర్టుగా నిలబెట్టేందుకు వెదురు గెడకు రూ. 100 ఖర్చవుతుంది. కనీసం వెదురు గెడ ఖర్చు కూడా రావడం లేదు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. - భూపతిరాజు తాతరాజు, అరటి రైతు, ఖండవల్లి, పెరవలి మండలం
సగం ధరకే కొనుగోలు
నేను ఎకరం పొలంలో కర్పూర రకం అరటి సాగు చేశాను. ఎకరా అరటి తోటకు 750 వరకూ గెలలు తెగుతాయి. చేతికి వచ్చిన పంటను మార్కెట్‌కు తరలిస్తే టోకు వ్యాపారులు సగం ధరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి శిస్తు రూ. 45 వేలు. దీంతోపాటు ఎకరానికి పెట్టుబడి రూ. 70 వేల వరకు పెట్టాను. మార్కెట్‌లో అరటిని కొనే నాథుడు లేక దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అరటి మొక్క నాటిన దగ్గర నుంచి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టపడి పండించి మార్కెట్‌కు తరలించినా రవాణా ఖర్చులు రావడం లేదు. - ఐనవల్లి సత్యనారాయణ, ఖండవల్లి, పెరవలి మండలం
రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలి..
రైతు భరోసా కేంద్రాల్లో అరటి రైతులు సంప్రదిస్తే ఎక్కడ మార్కెట్ ఉందో చెబుతారు. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసి మార్కెటింగ్ శాఖకు పంపిస్తారు. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో అరటి వాడకం తగ్గింది. దీంతో ఎగుమతులు కూడా తగ్గాయి. నిల్వ ఉంచేందుకు గోదాములు లేక విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడటం వాస్తవం. - టీవీ సుబ్బారావు, డిప్యూటీ డైరెక్టర్, ఉద్యాన శాఖ, ఏలూరు
ఇదీ చదవండి ప్రణాళికా లోపం.. వృథాగా తరలిపోతున్న నీరు