పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల విషయంలో దాఖలైన అప్పీళ్లపై.. హైకోర్టులో విచారణ వాయిదా పడింది. శుక్రవారం ప్రభుత్వం తరఫున వాదనలు విన్న హైకోర్టు.. ఏప్రిల్ 19 కి విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇతరుల వాదనల కోసం విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాకే ఏలూరు నగరపాలక ఎన్నికలు నిర్వహించాలంటూ.. గతంలో తామిచ్చిన ఆదేశాలను అధికారులు పాటించలేదని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ జడ్జి.. ఎన్నికలను నిలుపుదల చేశారు. ఆ ఉత్తర్వులపై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, శేషుకుమారి అనే మహిళ.. ధర్మాసనంలో అప్పీల్ వేశారు. వాటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రణాళిక ప్రకారమే మార్చి 11 న ఏలూరు నగరపాలక ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చింది.
ఈ విషయంపై వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్.. 2020 ఫిబ్రవరి 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించామన్నారు. అభ్యంతరాల సమర్పణకు సమయం ఇచ్చామని, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు జాబితాలో తప్పులను సవరించామని చెప్పారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తై.. లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించేందుకు వీలుగా అదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు.
ఇదీ చదవండి: