పశ్చిమ గోదావరి జిల్లాలో పంట కాలువలపై ఆధారపడిన మంచినీటి చెరువులను యుద్ధప్రాతిపదికన నింపేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కృష్ణా, పశ్చిమ డెల్టాల పరిధిలో సుమారు 200 చెరువులు జల కళతో ఉట్టిపడుతున్నాయి. 80-90 శాతం నీటి నిల్వలతో మరో 100 చెరువుల వరకు ఉన్నాయని ఉన్నతాధికారులు తాజా నివేదికలో పేర్కొన్నారు. నరసాపురం, అత్తిలి, బ్యాంక్ కెనాళ్ల పరిధిలోని శివారు గ్రామాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. ఆయా ప్రాంతాలకు మరో 10 రోజుల వరకూ పూర్తిస్థాయిలో నీరివ్వాలనే డిమాండ్ ప్రధానంగా వినపడుతోంది. వేసవిలో అన్నిచోట్లా తాగునీటి సమస్యలను అధిగమించాలంటే.. పంట కాలువలకు మరో 10 రోజులకు మించి ప్రత్యేకంగా నీరివ్వాల్సిన అవసరాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ గుర్తించింది.
డెల్టాలో ఇంజిన్లతో నీటి తోడకం
జిల్లాలో 443 మంచినీటి చెరువులున్నాయి. వీటిలో కృష్ణా డెల్టా పరిధిలో 46 చెరువులను వంద శాతం నింపారు. ఇక పశ్చిమ డెల్టాలో వెంకయ్య వయ్యేరు, జీఅండ్‌వీ, ఏలూరు కాలువలపై ఆధారపడిన గ్రామాలకు అవసరమైన నీరు చేరుతోంది. నరసాపురం, అత్తిలి, బ్యాంక్ కెనాళ్ల పరిధిలోని గ్రామాలకు ఇప్పుడిప్పుడే నీరందుతోంది. ఆర్‌డబ్ల్యూఎస్ మండల, డివిజన్ స్థాయి అధికారులు నరసాపురం, భీమవరం, కాళ్ల, ఆచంట, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, ఉండి తదితర మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ నరసాపురం సబ్ డివిజన్‌లోని 23 చోట్ల గ్రామీణ చెరువులతోపాటు.. కాళీపట్నం, మొగల్తూరు, లక్ష్మణేశ్వరం, తూర్పుతాళ్లు, రుస్తుంబాద, కేపీపాలెం, లంకలకోడేరు, పెనుమదం తదితర ప్రాంతాల్లోని సీపీడబ్ల్యూ పథకాలకు చెందిన 11 చెరువులకు నీరు తోడాల్సి ఉంది. ప్రాజెక్టు చెరువులకు కనీసం 15-20 రోజులకు మించి నీరిస్తే తప్ప అవి నిండే పరిస్థితులు కనిపించటం లేదని చెబుతున్నారు. 15వ తేదీ నుంచి నరసాపురం, బ్యాంక్ కెనాళ్ల పరిధిలోని గ్రామాలకు ప్రత్యేకంగా నీరివ్వాలని అధికారులు కోరుతున్నారు. సీపీడబ్ల్యూ పథకాలకు ప్రత్యేక ఆయిల్ ఇంజిన్లు వేసి రేయింబవళ్లు నీరు తోడుతున్నారు. పాలకోడేరు మండలంలోని రేలంగి ఛానల్‌పై ఆధారపడిన మోగల్లు గ్రామానికి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. ఆ గ్రామంలోని 2 చెరువుల్లో నీటి నిల్వలు బాగా తగ్గాయని అధికారులు గుర్తించారు. వారం రోజుల పాటు రేలంగి ఛానల్‌కి నీరిస్తే ఆ 2 చెరువులు నిండే అవకాశాలున్నాయి.
శివారు గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ
'నరసాపురం, బ్యాంక్, అత్తిలి కాలువలపై సాగునీటి ఇబ్బందులతో శివారు గ్రామాల్లో చెరువులు నిండలేదు. డెల్టాలో 20 చోట్ల చెరువులకు నీటి సమస్యలున్నాయని మా దృష్టికొచ్చింది. 2 రోజుల నుంచి ఆయా ప్రాంతాలకు నీరందుతోంది. శివారు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఆయిల్ ఇంజిన్లతో నీటి తోడకం పనులు జరుగుతున్నాయి. వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం.' - జేవీ రాఘవులు, జిల్లా పర్యవేక్షక ఇంజినీర్, ఏలూరు
ఇవీ చదవండి: