పశ్చిమ గోదావరి జిల్లా వనం - మనం కార్యక్రమం.. ఆదిలోనే హంసపాదుగా తయారైంది. అడుగు ముందుకు పడక.. అసలు లక్ష్యం నీరుగారుతోంది. అధికారుల నిర్లక్ష్యమో.. సంరక్షణలో లోపమో.. కారణమేదైనా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 11 లక్షల మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నాయి. వాటిపై సరైన పర్యవేక్షణ లేని ఫలితంగా... ఇప్పటికే 80 శాతం మొక్కలు ఎండిపోవడం.. వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.
జిల్లాలో 909 పంచాయతీలున్నాయి. వాటిలోని 720 పంచాయతీల పరిధిలో.. 2018 - 19 ఏడాదికి గాను.. 2 వేల 726 కిలో మీటర్ల మేర 11 లక్షలు మొక్కలు నాటారు. వీటి సంరక్షణ కోసం 9 లక్షల 12 వేలు, నీరు పోసేందుకు 8 లక్షల 13 వేలు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ... నాటిన మొక్కలు 20 శాతం మేర కూడా బతకలేదు. ఇప్పటికే వాడిపోయి.. మోడువారాయి. నాటిన మొక్కలు 70 శాతం వరకు బతికించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు చెబుతున్నా.. అందుకు రివర్స్ ఫలితాలు కనిపిస్తుండడం వెనక తప్పు ఎవరిదన్నదీ తేలాల్సి ఉంది.
మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాక... అధికారులు సంరక్షణ చర్యల్లో భాగమైతేనే.. ప్రస్తుత పరిస్థితి కాస్త మారే అవకాశం ఉందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.