ఆరోపణలు కారణంగా భర్తను పదవి నుంచి తొలగిస్తే... అన్ని అర్హతలున్న భార్యకు ఆ పదవి ఇవ్వకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది.అవినీతి ఆరోపణలతో బిహార్ సీఎం పదవి నుంచి లాలూప్రసాద్ యాదవ్ దిగిపోయిన తరువాత ఆయన సతీమణి రబ్రీదేవి పదవి చేపట్టిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా పోతనూరు గ్రామ శ్రీ భోగేశ్వరస్వామి విశాల సహకార పరపతి సంఘం పర్సన్ ఇంచార్జ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ధూళ్లిపాళ్ల రమాదేవి నియామకాన్ని సవాల్ చేస్తూ ఎన్.రమేశ్, మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన వ్యక్తి స్థానంలో ఆయన భార్యను నియమించడం సరికాదని, ఆ నియామకం చెల్లదన్నారు. ఆ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. భర్త తప్పు చేసినప్పుడు భార్యను శిక్షించాలని కోరడం సబబు కాదని వ్యాఖ్యానించింది . అప్పీల్‌పై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది
ఇదీ చదవండి: ఆ నోటీసులపై కౌంటర్ దాఖలు చేయాలని... సీఆర్డీఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలు