Central on Diaphragm Wall at Polavaram: పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్ ధ్వంసమైనంత మేర మరో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులు, డిజైన్ల పురోగతిపై సమావేశం నిర్వహించారు. గోదావరి భారీ వరదలు, కాఫర్ డ్యాం సగం సగం నిర్మాణంతో అప్పటికే నిర్మించిన డయాఫ్రం వాల్ కొంతమేర ధ్వంసమైంది. దానికితోడు రాతి, మట్టికట్టతో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట నదీగర్భంలో ఇసుక పెద్ద ఎత్తున కోసుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి.
దాంతో.. తాజా నిర్మాణాలు ఎలా చేపట్టాలన్న సవాలుకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో శుక్రవారం రెండోసారి భేటీ జరిగింది. తొలుత జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విశ్రాంత ప్రొఫెసర్లు నిపుణులు ఎ.ఎస్.రాజు, గోపాలకృష్ణ, హర్వీందర్‌సింగ్, హసన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ ఛైర్మన్ పాండ్యా, కమిటీ ముఖ్యులు హండా హాజరయ్యారు. ఏపీ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీరు సుధాకర్‌బాబు, సలహాదారు ఎం.గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెల్లర్ కంపెనీ ప్రతినిధులు, మేఘా కంపెనీ ప్రతినిధులూ సమావేశంలో పాల్గొన్నారు.
ఎంత ధ్వంసమైందో తేల్చాలి
తొలుత వెదిరె శ్రీరాం ఆధ్వర్యంలో కీలకమైన డిజైన్ల అంశాలు చర్చించారు. మధ్యాహ్నం నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం డయాఫ్రం వాల్ ధ్వంసమైన నేపథ్యంలో ఆ వాల్ సామర్థ్యం ఏ మేరకు ఉందో.. ఎంతమేర ధ్వంసమైందో తొలుత తేల్చాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. అక్కడ సమాంతరంగా మరో డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. దానికంటే ముందు ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్ పరిస్థితిని పూర్తిగా తేల్చాలి.
- డయాఫ్రం వాల్ పరిస్థితిని అధ్యయనం చేయాలంటే తొలుత అక్కడ ఉన్న నీటిని తోడేయాలి. అది అంత సులభం కాదని గుత్తేదారు సంస్థ వాదిస్తోంది.
- మరోవైపు గోదావరి కోత ఏర్పడ్డ ప్రాంతంలో ఇసుకను నింపి వైబ్రో కాంప్రాక్షన్ ద్వారా ఇసుక సాంద్రతను, గట్టిదనాన్ని పెంచవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వాదనతో డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ విభేదించింది. కేంద్ర జలసంఘం నిపుణులూ విభేదిస్తున్నారు.
- గోదావరి గర్భంలో ఇసుక కోత సమస్యను ఎలా పరిష్కరించాలనే విషయంలో మరింత లోతుగా నిపుణులు చర్చించి వారం రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్రమంత్రి ఆదేశించారు. తిరిగి ఏప్రిల్ 15న సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఇళ్లు నిర్మించే స్తోమత లేదని'... చేతులెత్తేస్తున్న లబ్ధిదారులు