అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి కొవిడ్ సోకిందనే అనుమానంతో కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించిన అమానుష ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో వెలుగుచూసింది. ఆకివీడు పరిధి అనాలచెరువు సమీపంలో.. వృద్ధురాలు(80) తన ఇద్దరు కుమారులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు రెండ్రోజుల నుంచి అనారోగ్యంగా ఉండటంతో కొవిడ్ సోకిందనే భయంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పట్టుపట్టారు. కరోనా భయంతో ఆ ప్రాంతంలో మిగిలిన వారు కూడా వారికి ఆశ్రయం ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమారులిద్దరూ తమ తల్లిని సోమవారం రాత్రి రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న శ్మశానవాటిక షెడ్డులో ఉంచి ఆమె బాగోగులు చూసుకున్నారు. మంగళవారం రాత్రి విషయం తెలుసుకున్న ఆకివీడు ఎస్.ఐ. వీరభద్రరావు.. సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వృద్ధురాలిని తిరిగి అద్దె ఇంటికి తీసుకువచ్చారు. ఇంటి యజమానితో మాట్లాడి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్.ఐ. తెలిపారు.
ఇదీ చదవండి:
పిల్లల్లో పెరుగుతున్న ముప్పు.. తల్లిదండ్రులూ అశ్రద్ధ వద్దు !