75 శాతం స్థానిక కోటా కల్పించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ విధానం సమాఖ్య స్ఫూర్తిపై ప్రభావం చూపుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని జతచేసి, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ ఓ ట్వీట్ చేశారు. పౌరులందరికీ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పని చేసుకునేందుకు రాజ్యాంగం వీలుకల్పించిందన్నారు. ఏపీ తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెనుప్రభావం పడుతుందని, మార్కెట్లపైనా ప్రభావం తప్పదని ఈ కథనం పేర్కొంది.
అమితాబ్‌కాంత్ ట్వీట్‌పై ఏపీ సీఎంవో ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ స్పందించారు. ఈ కథనం అసమగ్ర సమాచారంతో ఉందని పీవీ రమేష్ ఓ ట్వీట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో స్థానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. అంతేకానీ సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదని పీవీ రమేష్ పేర్కొన్నారు. ఈ సమాధానంపై స్పందించిన అమితాబ్‌కాంత్ అవి తన వ్యాఖ్యలు కావని దినపత్రిక రాసిన కథనాన్ని మాత్రమే పోస్టు చేసినట్టు మరో ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి : 'పెద్దలసభలో ఉన్నారు... పెద్దరికం తెచ్చుకోండి'