పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేములపల్లి గ్రామానికి చెందిన కంభం కుమార్తె అనిత (24)ను కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామానికి చెందిన దాసరి రాజేష్‌కు ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు. ఆషాఢమాసం కావడంతో అనిత తన పుట్టింటికి వచ్చింది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె ఇంట్లో తాడుకి వెలాడటం చూసిన తల్లిదండ్రులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించారు. అప్పటికే మృతి చెందింది.
సమాచారం అందుకున్న ధర్మాజీగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనితను తన మామ వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై భర్తకు చెప్పినా పట్టించుకోవడం లేదని... మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అనారోగ్యం కారణంగా అత్తవారింటికి వెళ్లడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మూడేళ్లు చిత్రవధ... నగ్న దృశ్యాలతో యువతికి వేధింపులు