జిల్లాలోని పలు పట్టణాలకు బృహత్తర ప్రణాళిక కాలపరిమితి కొన్నేళ్ల కిందటే ముగిసింది. రహదారులు ఇరుగ్గా మారి.. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి.. గృహ నిర్మాణాలకు చోటు తెలియక.. ప్రజల ఆహ్లాదానికి అవకాశం లేక.. గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలంటే కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయడమే శరణ్యం. ఈ క్రమంలో పలు పట్టణాల్లో ప్రణాళిక తయారీకి ముసాయిదాను సిద్ధం చేస్తున్నారు.
ఎదుర్కొంటున్న ఇబ్బందులు
పట్టణాల్లో రహదారులు ఇరుగ్గా మారాయి. కొత్తగా 5 నుంచి 20 వరకు కాలనీలు ఏర్పడిన పట్టణాల్లో ఏది నివాసిత ప్రాంతమో తెలియక నిర్మాణాలు ఆగుతున్నాయి. బృహత్తర ప్రణాళిక పునఃసమీక్ష (రివిజన్) నేపథ్యంలో ఏ ప్రాంతం ఏ పరిధిలోకి వెళ్తుందోననే భయాందోళనలు కొనసాగుతున్నాయి. భీమవరం పరిసరాల్లోని రాయలం, చినఅమిరం, తాడేరు, కొవ్వాడ-అన్నవరం, నరసింహాపురం, కుముదవల్లి, విస్సాకోడేరు గ్రామాలను భీమవరంలో విలీనం చేసే దిశగా ప్రాథమిక సర్వే చేపట్టారు. ఇదే విధంగా పలు పట్టణాలకు సమీపంలోని గ్రామాలను కలుపుతూ సర్వే చేస్తున్న సమాచారం కొందరికి తెలియక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కొనసాగుతున్న సర్వే..
విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ బిజినెస్, ఆర్కిటెక్చర్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకులో సర్వే చేస్తున్నారు. కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలులో స్కైగ్రూప్ వారు వివరాలను సేకరిస్తున్నారు. పురపాలక సంఘంగా వర్గోన్నతి పొందిన జంగారెడ్డి గూడెంలో కూడా సర్వే కొనసాగుతుండగా.. ఇటీవలే నగర పంచాయతీగా మారిన ఆకివీడులో ఇంకా మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదనలు అందలేదు.
వివరాల సేకరణ వేగవంతం
కొవిడ్-19 నేపథ్యంలో వివరాల సేకరణ ప్రక్రియ ఆలస్యమైంది. జీఐ విధానంలోనే కాకుండా ఇంటింటికీ వెళ్లి వివరాలను ఆయా ఏజెన్సీల ప్రతినిధులు సేకరిస్తారు. ముసాయిదా రూపొందించి.. ఎన్‌జీవోలు, ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మార్పులు చేర్పుల అనంతరం తుది ప్రణాళిక తయారవుతుంది. - కె.పాండురంగనాయకులు, పట్టణప్రణాళిక విభాగ ఆర్డీ
రానున్న 20 ఏళ్లను పరిగణిస్తేనే..
ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రణాళిక చట్టం 1920 ప్రకారం ప్రతి 20 ఏళ్లకోసారి మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలి. జనాభా, వాహనాలు, భవన, వ్యాపార సముదాయాలను అన్నింటినీ గుర్తించడమే కాకుండా రానున్న 20 ఏళ్ల తర్వాత పరిస్థితిని కూడా అంచనా వేయాలి. నివాసిత, పారిశ్రామిక, వ్యాపార విభాగాలుగా విభజిస్తారు. ప్రధాన రహదారికి ఇరువైపులా స్థలాన్ని విడిచి పెట్టి నిర్మాణాలు చేపట్టాలి. పారిశ్రామిక ప్రాంతాల్లో గ్రీన్‌బెల్ట్ రూపొందించాలి. నివాసిత ప్రాంతాల్లో పార్కులు, క్రీడలు, విద్యాలయాలకు అవసరమైన స్థలాలు కేటాయించాలి.
ఇదీ చదవండి: