పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన బడియా పాపయ్య అనే వలస కూలీ మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కేఆర్ పురానికి చెందిన పాపయ్య నెల రోజుల క్రితం తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు వచ్చాడు. లాక్డౌన్ కారణంగా స్వరాష్ట్రానికి వెళ్లలేకపోయాడు. కడియద్ద గ్రామానికి చెందిన దారపు రెడ్డి ఆంజనేయులు పాపయ్యతో ఉంగుటూరు మండలంలోని పరిశ్రమలలో పనులు ఉన్నాయని చెప్పాడు. ఇరువురు కాలినడకన ఉంగుటూరు వైపు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు బాదంపూడి వద్దకు వచ్చేసరికి కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాపయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర్రాజు తెలిపారు.
ఇదీ చూడండి:రెడ్‌జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన డీఐజీ