బైక్ మెకానిక్ జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడు. తన గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి చోరీలు చేసేవాడు. ఆ సొత్తును తన బంధువు సాయంతో అమ్మి డబ్బు సంపాదించే వారు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన మునగాల సాయివెంకట కృష్ణ కథ.
జల్సాలకు అలవాటుపడిన సాయికృష్ణ దొంగతనాలు చేయడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే చినరామచంద్రపురానికి చెందిన గార్లపాటి వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆయనతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడేవారు. దొంగిలించిన వాటిని అమ్మేందుకు సాయికృష్ణ బావమరిది లింగంపల్లి దుర్గాప్రసాద్ సాయం చేసేవాడు. చేబ్రోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, గణపవరం, ఆకివీడు ప్రాంతాల్లో వీరిపై దొంగతనం కేసులు నమోదయ్యాయి.
ఈనెల 7న వెల్లమిల్లి జాతీయ రహదారి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ ముగ్గురు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 7.23 లక్షలు ఉంటుందని సీఐ భగవాన్‌ప్రసాద్ వెల్లడించారు. ఈ ముఠాను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ నవదీప్ సింగ్ అభినందించినట్లు సీఐ వివరించారు.
ఇదీ చదవండి: తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు