Ideal ODF Plus Village: పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కావలిపురం గ్రామ పంచాయతీకి ప్రత్యేక మైన గుర్తింపు ఉంది. అక్కడి పంచాయతీ అధికారులు, సిబ్బంది.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం, ప్రజలు కూడా పాటించేలా చేయడం ఇక్కడ ఆనవాయతీ. ప్రజా ప్రతినిధులు గ్రామ నాయకులు అందుకు అనుగుణంగా సహకారం అందిస్తారు. గ్రామాల పరిశుభ్రత ద్వారానే అభివృద్ధి సాధ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ సంకల్ప పథకాలను అమలు అమల్లోనికి తెచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపును అందుకున్న కావలిపురం గ్రామపంచాయతీ అధికారులు.. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రాతిపదికలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలు పాటించేలా అవగాహన కల్పించారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు భాగస్వాములు అయ్యారు.
వీరందరూ సమన్వయ కృషితో రహదారులు మురుగు కాలువలు, నిర్మాణం, పరిశుభ్రంగా ఉంచడం, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తడి పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించడం, సేకరించిన చెత్తలతో వర్మీ కంపోస్టు తయారు చేయడం ద్వారా పరిశుభ్రతకు మారుపేరుగా గ్రామాన్ని తీర్చిదిద్దారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధులు గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత చర్యలపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించిన ప్రాతిపదికలను తూచా తప్పకుండా అమలు చేయడం వల్ల జాతీయస్థాయిలో ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా గుర్తింపు పొందగలిగామని అధికారులు చెప్తున్నారు. సిబ్బంది, ప్రజల సమన్వయ కృషి స్థానిక నాయకుల సహకారం ఇలా అందరి కృషితో కలిసి అవార్డును సాధించి పెట్టాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా గుర్తింపు పొందిన కావలిపురాన్ని ఆదర్శంగా తీసుకొని పరిసర ప్రాంతాలు ఆ దిశగా అడుగులు వేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
ఎప్పుడూ కూడా తడి చెత్త, పొడి చెత్త సేకరణ.. ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండటం రోడ్లు, డ్రైనేజీలు శుభ్ర పరచడం ఇంకా మొదలగు అంశాల మీద ఓడీఎఫ్కి ఎంపిక కావడం జరిగింది. మా ఊరికి ముఖ్యమైన కారణం ఏంటంటే మాకు అందే సహకారం వల్ల ఇవన్నీ జరిగాయి.- మునిరాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి
జాతీయ స్థాయిలో జలశక్తి అభియాన్ ద్వారా ఓడీఎఫ్ ప్లస్ గ్రామంగా గుర్తింపు లభించడంలో అందరి ప్రోత్సాహం చాలా ఉంది. దీంట్లో గ్రామ ప్రజల కృషి ఎంతో గొప్పది.. అదే విదంగా ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు, ఇక్కడి సిబ్బింది.. అందరూ ఎంతో సమన్వయంతో జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక అయింది.- కృష్ణమోహన్, ఇన్చార్జ్ ఎంపీడీవో
ఇవీ చదవండి: