కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుడికి భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రసిద్ధ క్షేత్రాల్లో భక్తులు దీపారాధనలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయాల్లో మహిళలు తెల్లవారుజాము నుంచే కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.
గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన గోకర్ణేశ్వరస్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీగా మారింది. పాలంగిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో అరటి దొప్ప లపై వెలిగించిన దీపారాధనలను భక్తులు కోనేటిలో వదిలారు. తణుకు పాత ఊరులోని సిద్దేశ్వర స్వామి, వేంచేసి ఉన్న పార్వతీ సమేత కపర్ధీశ్వర ఆలయాలలో స్వామివారికి పాలాభిషేకాలు చేశారు.
ఇదీ చదవండి:
దేశవాళీ నల్ల వంగడాలతో సన్నరకం సంకరీకరణ.. బాపట్లలో నూతనంగా అభివృద్ధి