పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు సంస్థపై దాడులు చేసినట్లు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గత నెల 28న.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థకు చెందిన పలు కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సినిమా ఫైనాన్సింగ్‌తో పాటు పంపిణీ, రొయ్యల పెంపకం, రియల్ ఎస్టేట్, వివిధ నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. 2016-17 నుంచి 2019-20 మధ్య రూ. 161 కోట్ల లావాదేవీలు జరగ్గా.. వీటిలో అధిక మొత్తం పన్ను పరిధిలో జరగాల్సినవే ఉన్నాయని స్పష్టం చేశారు.
లెక్కల్లోకి రాకుండా జాగ్రత్తలు...
ఈ సోదాల్లో చేతిరాతతో ఉన్న పలు అకౌంట్ పుస్తకాలు, నగదు లావాదేవీల వివరాలు, ఒప్పందాలు, ఖాళీ పత్రాలు స్వాదీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపి వడ్డీలు వసూలు చేస్తూ.. ఇవేవీ లెక్కల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. సుమారు రూ. 13 కోట్లకు సంబంధించిన వివరాలను క్లౌడ్ నుంచి తొలిగించగా.. ఆ సమాచారాన్ని రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
నగదు రూపంలోనే లావాదేవీలు...
సినిమాలు పంపిణీ చేయడంతోపాటు వివిధ ప్రాంతాల్లో థియేటర్లు నడుపుతూ.. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని దాచి ఉంచారని ఐటీ అధికారులు తెలిపారు. అనేక ప్లాట్లు అమ్ముతూ.. మొత్తం రిజిస్ట్రేషన్ లావాదేవీలు నగదు రూపంలోనే నడిపారని పేర్కొన్నారు. ఏలూరు, రాజమహేంద్రవరంలో జరిగిన సోదాల్లో రూ. 14.26 కోట్ల నగదు, ఆభరణాలు, రూ. 3.42 కోట్ల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: