పశ్చిమ గోదావరి జిల్లాలో జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించడంతో వాటికి కొత్త కళ వచ్చింది. కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు పది నెలలపాటు ఇంటికే పరిమితమైన విద్యార్థులు.. భవిష్యత్తుపై కొత్త ఆశలతో కళాశాలల్లోకి అడుగుపెట్టారు. మొన్నటి వరకు పాఠశాలలో విద్యనభ్యసించినవారు కళాశాల స్థాయికి చేరుకోవడంతో ఎంతో ఆనందపడుతున్నారు. విద్యాసంవత్సరం ఆలస్యం కావడంతో ప్రభుత్వం విద్యార్థులకు పరీక్షల సిలబస్ తగ్గించింది.
పెరగనున్న విద్యార్థుల సంఖ్య..
జిల్లాలో మొత్తం 235 జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 43,021 మంది ఉండగా, వీరికి నవంబరు 2 నుంచి తరగతులు ప్రారంభించారు. కళాశాలలకు హాజరుకాని వారి కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 22 వేల మంది నిత్యం కళాశాలల్లో నిర్వహించే తరగతులకు హాజరవుతున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 17 వరకు తొలివిడత అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించగా 20,548 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రెండో విడత ఈ నెల 18న ప్రారంభం కాగా 25 వరకు కొనసాగుతుంది. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
సిలబస్ కుదింపు..
ప్రభుత్వం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్చి నెలాఖరు వరకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కొవిడ్ కారణంగా విద్యాసంవత్సరం వృథా అయిన నేపథ్యంలో ప్రతి సబ్జెక్టు నుంచి 30 శాతం సిలబస్ కుదించింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభించగా, మే 31 వరకు 106 రోజులపాటు కొనసాగిస్తారు. వీరికి సిలబస్‌ను ఎంతమేర తగ్గిస్తారో ప్రకటించాల్సి ఉంది. రెండో శనివారం, వేసవి సెలవుల్లో కూడా రెండు సంవత్సరాల విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిలబస్, పనిచేసే రోజులకు అనుగుణంగా అధ్యాపకులు ప్రణాళికలు రూపొందించి, అందుకు అనుగుణంగా బోధిస్తున్నారు.
నిబంధనలు ఇలా..
కొవిడ్ నేపథ్యంలో ఇంటర్ విద్యామండలి ఆదేశాల ప్రకారం వందలోపు విద్యార్థులున్న కళాశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తరగతులు నిర్వహించాలి. 101 నుంచి 500 వరకు ఉంటే రెండు విడతలుగా, 500 మంది కంటే ఎక్కువుంటే రెండో విడతలుగా నిర్వహించడంతోపాటు సగం మందికి ఒక రోజు, మిగతా వారికి తర్వాతి రోజు తరగతులు నిర్వహించనున్నారు.
ఏడు నెలల అనంతరం..
ఏడు నెలలుగా మిత్రులకు దూరంగా ఉన్నాం. పాఠశాల విద్య పూర్తిచేసుకొని కళాశాలలో ఎప్పుడు అడుగుపెడదామా.. అనే ఆసక్తి చాలారోజుల నుంచి ఉంది. ఎట్టకేలకు సంక్రాంతి తర్వాత మిత్రులందరినీ కళాశాలలో కలుసుకునే అవకాశం కలిగింది. లాక్‌డౌన్ సమయంలో పోటీ పరీక్షల పుస్తకాలు చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. - ఎ.దివ్యజ్యోతి, వి.రమ్య, పెంటపాడు
సద్వినియోగం చేసుకుంటాం..
లాక్‌డౌన్ అనంతరం కళాశాలకు రావడం కొత్త అనుభూతినిస్తోంది. కొత్త స్నేహితులు పరిచయమాయ్యారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళిక ప్రకారం చదివితే తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్ఛు తరగతి గదిలో అధ్యాపకులు చెబుతున్న పాఠాలను ఏకాగ్రతతో వింటున్నాం. - మణికంఠ, రాజు, విద్యార్థులు, పెంటపాడు
ఇదీ చదవండి: విద్యార్థుల కోసం మాష్టారు యూట్యూబ్ ఛానల్