మొదటి అర్ధసంవత్సర ఆస్తి పన్ను వసూళ్లులో పశ్చిమగోదావరి జిల్లాలోని పురపాలికలు లక్ష్యాన్ని అధిగమించాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 68 కోట్ల 60 లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా... మొదటి అర్ధ సంవత్సరంలో 36 కోట్ల 82 లక్షల రూపాయలు, 60 శాతంపైగా వసూలు చేసి లక్ష్యం సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ వసూళ్లు 20 శాతం అధికంగా ఉన్నాయి.
జిల్లాలో 8 పురపాలక సంఘాలు ఒక నగరపాలక సంస్థ ఉంది. వీటిలో ప్రతి సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఏప్రిల్ మొదటి తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు మొదటి అర్ధ సంవత్సరంగాను, అక్టోబర్ మొదటి తేదీ నుంచి మార్చి నెలాఖరు వరకు రెండో అర్ధ సంవత్సరంగాను లెక్కిస్తారు. ఆస్తి పన్ను వసూలుకు సంబంధించి మొత్తం సంవత్సరానికి లెక్కించి అర్ధ సంవత్సరం లక్ష్యం నిర్దేశించుకుంటారు.
కరోనా కారణంగా సంవత్సరానికి ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ప్రభుత్వం ఐదు శాతం రాయితీ కల్పించింది. జూలై నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించింది. జిల్లాలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొవ్వూరు పురపాలక సంఘం మొత్తం ఆస్తి పన్ను కోటి 60 లక్షలకు కోటి 40 లక్షల రూపాయలు 87. 80 శాతం వసూలు చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
తణుకు పురపాలక సంఘం7 కోట్ల 26 లక్షల రూపాయలకు... 4 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసి.. 65. 70 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఏలూరు నగరపాలక సంస్థ మాత్రం 23 కోట్ల 8 లక్షల లక్ష్యానికి 9 కోట్ల 39 లక్షల రూపాయలు వసూలు చేసి లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది.
ఇదీ చూడండి. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పనితీరుపై సీఎం ప్రశంసలు