Chennai-Kolkata Highway Damaged : ఆరు వరుసల జాతీయ రహదారి కదా అని టాప్ గేర్ వేసి రయ్‌రయ్‌మని దూసుకుపోదామంటే కుదరదు. పైవంతెనలు వచ్చినప్పుడల్లా బ్రేక్ వేయాల్సిందే. లేకుంటే కుదుపులు ఎత్తేస్తాయి పైకి ఎగిరేసి సీట్లో పడేస్తాయి. సర్లే కాస్త స్పీడ్ తగ్గిద్దామని గేర్ మారిస్తే వెనుక వచ్చే వాహనాలకు ముప్పే! చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో చిన్నఅవుటపల్లి నుంచి గుండుగొలను వరకు వంతెనల వద్ద ఇదే పరిస్థితి. అప్రోచ్‌లు కుంగిపోయి ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. వాహనాదారులను ముప్పతిప్పలు పెడుతున్న ఎగుడుదిగుడుల హైవేపై ఈటీవీ భారత్-ఈనాడు క్షేత్రస్థాయి కథనం.
ప్రయాణం సాఫీగా సాగేలా విజయవాడ శివారులోని గన్నవరం దాటాక చిన్నఅవుటపల్లి-కలపర్రు-గుండుగొలను మధ్య ఉన్ననాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించారు. రెండు ప్యాకేజీల్లో వేర్వేరు గుత్తేదారు సంస్థలు పనులు చేయగా మూడేళ్ల కిందటే హైవేపై రాకపోకలకు అనుమతించారు. అనేక చోట్ల బైపాస్‌ల నిర్మాణంతో మంచి మార్గం అందుబాటులోకి వచ్చిందని రయ్‌రయ్‌మంటూ దూసుకుపోవచ్చని వాహనదారులు భావించారు. కానీ కొంతకాలానికే లోపాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వంతెనల వద్ద అప్రోచ్‌లు కుంగి ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది.
చిన్నఅవుటపల్లి నుంచి గుండుగొలను వరకు పైవంతెనల వద్ద దుస్థితిపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈటీవీ భారత్-ఈనాడు బృందం క్షేత్రస్థాయికి వెళ్లింది. ప్రతి పైవంతెన వద్దకు వెళ్లి వాహనాలు ఎంతలా కుదుపునకు లోనవుతున్నాయో పరిశీలించింది. ఆత్కూరు, తేలప్రోలు, అంపాపురం, కోడూరుపాడు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ బైపాస్, తాళ్లమూడి, బొమ్ములూరు, ఆశ్రమం జంక్షన్, దెందులూరు ఇలా అన్నిచోట్లకూ ప్రతినిధులు వెళ్లారు. ఈ హైవేలో రెండువైపులా పైవంతెనలపై నెలకొన్న ఇబ్బందులు స్పష్టంగా బయటపడ్డాయి.
Chinna Avutapalli Road Problems : ఈ మార్గంలో అనేక చోట్ల గ్రామాలు, వాగులు, వంకలు ఉన్నచోట్ల వంతెనలు నిర్మించారు. వాటివద్దే వాహనాలు కుదుపులకు గురవుతున్నాయి. కాంక్రీట్ ప్యానెల్స్‌తో కూడిన బ్రిడ్జిలకు ఇరువైపులా అప్రోచ్‌లు ఉన్నాయి. అయితే పైవంతెనకు సమానంగా ఉండాల్సిన అప్రోచ్‌లు కొంత కిందకు కుంగాయి. దీంతో వాహనాలు అదపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా వెళ్లే వాహనాలకు ఎగుడుదిగుడులు కనిపించకపోవడంతో కుదుపులకు లోనవుతున్నాయి. దీనివల్ల కారులో కూర్చున్నవారంతా సీట్లలో ఎగిరి పడుతున్నారు. పోనీ ముందే తేరుకుని ఒక్కసారిగా వేగం తగ్గిస్తే వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టి ప్రమాదాలు జరిగే అవకాశముంది. బస్సులు, అధిక లోడుతో వెళ్లే లారీలు అందరూ సమస్యను ఎదుర్కొంటున్నారు.
అప్రోచ్ కుంగినచోట వెంటనే మరమ్మతులు చేయకుండా గుత్తేదారులు చోద్యం చూస్తున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు కూడా పట్టించుకోకుండా వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. రహదారి పూర్తయిన తర్వాత నాలుగేళ్లపాటు నిర్వహణ బాధ్యత గుత్తేదారులకే ఉంది. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలి. కానీ కాంట్రాక్టర్లు వీటిపై దృష్టి పెట్టడంలేదు. రహదారి పరిస్థితిని ఈటీవీ భారత్-ఈనాడు బృందం ఎన్హెచ్ఏఐ అధికారుల వద్ద ప్రస్తావించింది. అనేక పైవంతెనల వద్ద అప్రోచ్ రహదారి స్వల్పంగా కుంగిందని దీనిని సెటిల్ కావడం అంటారని అధికారులు తెలిపారు. వాటిని సరిచేసేలా గత వారమే గుత్తేదారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఆ ఊరిని వణికిస్తున్న హైవే - చీకటిపడితే చాలు గ్రామస్థుల్లో గుబులు