ISRO About NVS-02 satellite Launch Issues: కొద్దిరోజుల కిందట నింగిలోకి చేరిన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాటిలైట్‌లోని ఇంజిన్లు ప్రజ్వరిల్లకపోవడమే ఇందుకు కారణం. భారత ఉపగ్రహం నేవిగేషన్ వ్యవస్థలో ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం ఎంతో కీలకమైనది. దీన్ని జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా గత నెల 29న నింగిలోకి ప్రయోగించారు. ఇస్రోకు ఇది వందో ప్రయోగం కావడం గమనార్హం.
ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో తాజాగా కసరత్తు చేపట్టింది. ఇందుకోసం శాటిలైట్‌లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్‌ను పంపి, అవి ప్రజ్వరిల్లేలా చేయాలి. అయితే ఆక్సిడైజర్‌ను ఇంజిన్లలోకి చేరవేసే వాల్వ్‌లు తెరుచుకోలేదు. దీంతో ఇంజిన్లు ప్రజ్వరిల్లలేదని ఇస్రో ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం భూఅనువర్తిత బదిలీ కక్ష్య (జీటీవో)లో పరిభ్రమిస్తోంది. ఈ కక్ష్య నేవిగేషన్ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు అనువైంది కాదు. ప్రత్యామ్నాయ మార్గాలను ఇస్రో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మన ఇస్రోకి 'వంద'నం - రేపు 100వ రాకెట్ ప్రయోగం
అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో
సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత