Tanuku SI Murthy Last Audio Call : పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామీణ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి (ఏజీఎస్ మూర్తి) తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫోన్లో మాట్లాడారు. ఆ ఆడియో ప్రస్తుతం బయటకు రావడంతో వైరల్‌గా మారింది. సంబంధం లేని విషయంలో తనను ఇరికించారని, కావాలనే ఆ ఇద్దరూ తనను ఇబ్బంది పెడుతున్నారు. విజ్జిని, పిల్లలను తలచుకుంటే బాధేస్తోందని ఏజీఎస్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అదే శాఖలోని పని చేసే తన సహచరుడితో ఫోన్లో జరిగిన సంభాషణ ఇలా
సహచరుడు : ఎలా ఉన్నావ్?
ఏజీఎస్ మూర్తి : రేంజ్‌కి రిపోర్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది.
సహచరుడు : ఎప్పుడు?
ఏజీఎస్ మూర్తి : ఇప్పుడే (శుక్రవారం ఉదయం)
సహచరుడు : ముందు అక్కడికి వెళ్లి చూడు?
ఏజీఎస్ మూర్తి : నువ్వేం చెప్పినా నా చేతుల్లో ఏమీలేదు. జీవితంపై ఆసక్తి లేదు. నన్ను మోసం చేసిన ఆ ఇద్దరూ ఆనందంగా ఉన్నారు. వీఆర్ భీమవరంలోనే కదా అని ఓపిక పట్టాను. ఇక నావల్ల కాదు.
సహచరుడు : మళ్లీ ఈ రేంజ్ గొడవేంటి?
ఏజీఎస్ మూర్తి : తెలియదు, నేనైతే వెళ్లలేను. రిపోర్టు చేయడం నావల్ల కాదు. మనసేమీ బాగోలేదు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఆ ఇద్దర్ని ఎంతో మొత్తుకున్నా. వారు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు.
సహచరుడు : లూప్ కావాలని అడుగు?
ఏజీఎస్ మూర్తి : అక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. ముందుగా ఊహించిందే జరుగుతుంది. విజయ, పిల్లలను తలుచుకుంటేనే బాధేస్తోంది. మనమందరం సంతోషంగా ఉంటామని అనుకున్నా.
సహచరుడు : ఏవేవో ఊహించకు?
ఏజీఎస్ మూర్తి : కృష్ణా జిల్లాకు పంపిస్తారు. ఒక రోజు కూడా నేను అక్కడ ఉండలేను.
సహచరుడు : నువ్వు కంగారు పడి, పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నీకు ఎలా చెబితే అర్థమవుతుంది? పాజిటివ్‌గా ఆలోచించు. నీకు మైండ్ సెట్ బాగోలేదు. నువ్వు లేకపోతే భార్యాపిల్లలను ఎవరు చూస్తారు. నీకు అన్యాయం జరిగింది. నువ్వు చనిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? నీ కుటుంబాన్ని ఎవరూ ఆదుకోరు. ఆ ఇద్దరూ పశ్చాతాపం చెంది ఉద్యోగం వదులుకుంటారా? ఇవేమీ జరగవు. వీఆర్‌లో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. దాన్ని పట్టించుకోకు. లా అండ్ ఆర్డర్ వదిలేయ్. లూప్ అడుగు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నీ భార్యాపిల్లల గురించి ఆలోచించు. ఆ అమ్మాయికి ముందువెనుక, పుట్టింటికెళ్లి ఏడవడానికి కూడా ఎవరూ లేరు. నువ్వు చూసుకోవడం వేరు, మీ అన్నయ్య వాళ్లు, ఇతరులు చూడటం వేరు. ప్రాణం తీసుకునే ఇబ్బందేమీ లేదు. సరెండర్ చేశారు. వెళ్లి అడుగు. అవసరమైతే నేనూ వస్తాను. కృష్ణా జిల్లా అయితే నష్టమేముంది. పశ్చిమగోదావరిలో నీకు అన్యాయం జరిగింది. జిల్లా మారితే మార్పు వస్తుందేమో ఆలోచించు. నీకు అన్యాయం జరిగింది. ఒప్పుకుంటాను. నా మాట వినకపోతే ఎలా నువ్వు చచ్చిపోతే నీ కుటుంబానికి న్యాయం జరుగుతుందా? కాస్త ఆలోచించు నిన్ను నమ్ముకున్న వారి కోసం ఆలోచించు. ఈ రోజు రేపు ఐజీ ఉండరు. తర్వాత వెళ్లి మాట్లాడదాం. ఐదు నిమిషాల్లో సమస్యకు పరిష్కారం దొరకదు. ఆలోచించు.
ఏజీఎస్ మూర్తి : నేను వెళ్లలేను, నా వల్ల కావడం లేదు. ఏడుస్తూ!