గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీస్థాయిలో గోదావరికి వరద నీరు వస్తుండడంతో పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు,పోలవరం మండలంలోని 30 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కుక్కునూరు మండలంలోని ఎద్దువాగు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కోవిద, కట్కూరు టేకుపల్లి, పేరంటాలపల్లి గ్రామపంచాయతీలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నిత్యావసరాల కోసం పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్ద గోదావరి నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 48 గేట్ల నుంచి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు బయటకు వెళుతోంది. సాయంత్రానికి మరో 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో ఆయా ప్రాంతాల అధికారులు అప్రమత్తమై సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కుక్కునూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద, ఏలూరు కలెక్టరేట్‌లో ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:
Huge Floods to Godavari: గోదావరికి వరద ఉద్ధృతి.. సముద్రంలోకి 3.26 లక్షల క్యూసెక్కులు!