మాజీమంత్రి, భాజపా దివంగత నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారిన పడి మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. మంత్రిగా, పార్టీ నాయకునిగా ఆయన చేసిన సేవలు ఎందరికో చిరస్మరణీయం. ఎందరో అభిమానులు ఆయనకున్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన సీహెచ్ శిల్పకళా వేదిక యజమాని చంద్రశేఖర్. తన అభిమాన నేత విగ్రహాన్ని రూపొందించటానికి శ్రీకారం చుట్టారు.
2 దశాబ్దాలకుపైగా శిల్పకళా నైపుణ్యం కలిగిన ఆయన... పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. పైడికొండల మాణిక్యాలరావు అంటే ఎనలేని అభిమానం అని అందుకే విగ్రహాన్ని తయారు చేస్తున్నానని చంద్రశేఖర్ తెలిపారు. ఈ విగ్రహాన్ని కుటుంబసభ్యులకు బహూకరించనున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నో విగ్రహాలు తయారు చేశానని, ఇటీవల తయారుచేసిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం తనకు ఎంతో పేరు తెచ్చి పెట్టిందని పేర్కొన్నారు. పైడికొండల మాణిక్యాలరావు విగ్రహం తనకు మరింత పేరు తీసుకువస్తుందని ఆకాంక్షించారు.
ఇదీ చదవండీ... భూములకు భద్రత... ప్రాణాలకు రక్షణ ఏది: చంద్రబాబు