రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర దక్కేలా చూడడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మద్దతు ధరతోపాటు మిల్లుకు ధాన్యాన్ని రవాణా చేయడానికి ఛార్జీలు చెల్లిస్తుంది. రైతులే అద్దె ట్రాక్టర్లు, లారీల ద్వారా తీసుకొచ్చి.. మిల్లుకు సరకు అప్పగిస్తే రవాణా ఛార్జీలు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం రైతులకు ఇవి అందడం లేదు. 75కిలోల బస్తాకు 20రూపాయల వరకు ఛార్జీలు ఇవ్వాలి. గత మూడేళ్లలో ఇలా చెల్లించిన ధాఖలాలు లేవు. చాలా మందికి ఈ సంగతే తెలియదు. తెలిసినవాళ్లు ప్రశ్నిస్తే ధాన్యం తీసుకోబోమని మిల్లర్లు దబాయిస్తున్నారు.
ఛార్జీలను దోచేస్తున్న మిల్లర్లు
జిల్లాలో ఖరీఫ్ లో ఏడులక్షల ఎకరాల్లో వరిపంట సాగవుతుంది. రబీలో 5లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. గత ఖరీఫ్‌లో 13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ రబీలో ఇప్పటికే వరినూర్పిళ్లు ముగింపు దశకు చేరుకొన్నాయి. 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఖరీఫ్, రబీల్లో ధాన్యం కొనుగోలుచేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. డ్వాక్రా గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో రైతు విక్రయించాలి. రైస్ మిల్లర్లకు, రైతులకు మధ్యవర్తిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయి. కళ్లాల నుంచి రైతులే ధాన్యాన్ని రైస్ మిల్లుకు రవాణా చేయాలి. దీనికి ఛార్జీలు చెల్లించాలి. ఇక్కడ అమలు కావడం లేదని రైతులు అంటున్నారు.
ఒక్కో రైతుపై పదివేల భారం
జిల్లాలో ఖరీఫ్ 2వందలకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అదే రబీలో 150వరకు ఏర్పాటు చేస్తున్నారు. సంబంధింత రైతు తమ ఆధార, పట్టాదార్ పాసు పుస్తకంతో కొనుగోలు కేంద్రంలో మద్దతుధరకు ధాన్యాన్ని విక్రయించవచ్చు. రవాణా సమయంలో రైతు ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. 20నుంచి 50కిలోమీటర్ల దూరం వరకు ధాన్యం తీసుకెళ్తున్నారు. వాహనాల అద్దెలకు ఒక్కో రైతు పదివేల వరకు ఖర్చుచేస్తున్నారు. జిల్లాలో ఏటా సుమారు 30కోట్ల వరకు రవాణా ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇదంతా మిల్లర్ల ఖాతాల్లోకి వెళ్తుందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి రవాణ ఛార్జీలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.