పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా పలువురు తహసీల్దార్లపై మండిపడటం తీవ్ర వివాస్పదమైంది. కలెక్టర్ కార్తికేయ మిశ్రాను బదిలీ చేయాలని ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్లను కలెక్టర్ అసభ్య పదజాలంతో దూషించారని ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. కొందరు ఐఏఎస్ అధికారులు కిందిస్థాయి సిబ్బందిని వేధిస్తున్నారన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఉద్యోగుల సంఘం వెల్లడించింది. ఉన్నతాధికారులు దూషించటం మానుకోకపోతే కుటుంబాలతో కలసి ధర్నా చేస్తామని నేతలు హెచ్చరించారు. తహసీల్దార్లను దూషించిన అంశంలో కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
మూడు రోజుల కిందట కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియపై తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్యం చేరుకోని తహసీల్దార్లపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా..అందులో తహసీల్దార్లను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. తహసీల్దార్ స్థాయి అధికారులపై కలెక్టర్ అవహేళనగా మాట్లాడటంపై ఎమ్మార్వోలు మనస్థాపానికి గురయ్యారు.
దురుద్దేశపూర్వకంగా మాట్లాడలేదు
ఈ అంశంపై జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలిశారు. అధికారుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆయనకు తెలియజేశారు. తాను దురుద్దేశపూర్వకంగా మాట్లాడలేదని..తామంతా ఒక కుటుంబం అనే ఉద్దేశంతో మాట్లాడానని కలెక్టర్ వివరణ ఇచ్చారు. తహశీల్దార్లకు ధైర్యమిచ్చేందుకు అలా మాట్లాడనని..జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో రెవెన్యూ ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషిస్తారని అలాంటి వారితో కలసికట్టుగా ముందుకు సాగుతానని ఆయన వారికి తెలియజేశారు.
ఇదీ చదవండి