పశ్చిమ గోదావరి జిల్లాలో 1.67 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతోంది. ఇప్పటి వరకూ 15,030 హెక్టార్లలో మాత్రమే కోతలు కోశారు. మిగిలిన విస్తీర్ణంలో వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం 772 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. 416 హెక్టార్లలో మొక్కజొన్న కోత దశలో ఉండగా 223 హెక్టార్లలో పంట నేలకొరిగింది. ఉద్యాన పంటల్లో ప్రధానంగా అరటి 440 హెక్టార్లు, నిమ్మ 12 హెక్టార్లు, కూరగాయలు 8 హెక్టార్లు, బొప్పాయి, పొగాకు పంటలు 2 హెక్టార్లలో దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
అరటి రైతు విలవిల..
కరోనా వైరస్ ప్రభావం అరటి పంటపై పడింది. రాష్ట్రం నుంచి ఎగుమతులు లేక గెలలు చెట్లకే ముగ్గి పోతున్నాయి. కోసి నిల్వ చేద్దామన్నా శీతల గిడ్డంగులు లేవు. ఇలాంటి సమయంలో వీచిన ఈదురు గాలులకు పంట పూర్తిగా నేలవాలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో 36వేల ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. మొన్నటిదాకా పండిన పంటకు ధర లేదు... ప్రస్తుతం ఎంతోకొంత బాగానే ఉందనుకున్న సమయంలో తయారైన పంటను ఎగుమతి చేసేందుకు దారి మూసుకుపోయింది.
ఈ సమయంలో వచ్చిన గాలి దుమారం కారణంగా 1100 ఎకరాల్లో సుమారు రూ. 5 కోట్ల విలువైన అరటి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో నిడదవోలు, తణుకు, కొవ్వూరు, ద్వారకాతిరుమల, పెనుగొండ, ఇరగవరం, ఆచంట, పెరవలి, చాగల్లు, కామవరపుకోట, టి.నరసాపురం, గోపాలపురం, తాళ్లపూడి తదితర ప్రాంతాల్లో అరటి సాగు ఎక్కువగా ఉన్నా, మిగిలిన మండలాల్లో కూడా సాగు ఉంది. తణుకులో అరటి మార్కెట్ కేంద్రం ఉంది. అరటి సాగు, ఉత్పత్తుల ద్వారా సుమారు 18 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఎగుమతులు నిలిచి పోవటంతో వారంతా ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు.
అప్పు చేసి పెట్టుబడి
నిడదవోలు మండలం కంసాలిపాలేనికి చెందిన నాగులు తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి సాగు చేశారు. సుమారు రూ.6.30 లక్షల వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టారు. ఇప్పుడిప్పుడే దిగుబడి వస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో రవాణా సదుపాయం లేక గెలలు చెట్లకే ఉండిపోయాయి. ఈ సమయంలో గురువారం వీచిన ఈదురు గాలులకు పంటంతా నేలమట్టమైంది.
రూ. 10 లక్షల నష్టం
దేవ దేవరపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన రైతు పరిమి శ్రీరామకృష్ణ 10 ఎకరాల్లో 10 వేల అరటి మొక్కలు పెంచారు. గెలలు పెరిగి కాయలు పక్వానికి వస్తున్న తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో సుమారు 5వేల చెట్లు కూలిపోయాయి. ఒక్కో గెలను రూ.200కు కొనుగోలు చేసేలా వ్యాపారితో ఒప్పందం చేసుకున్నారు. ఈదురు గాలుల వల్ల ఈయన ఒక్కరికే రూ. 10 లక్షల నష్టం వాటిల్లింది. పంటల బీమా పథకం అమల్లో లేకపోవడంతో లబోదిబోమంటున్నారు.
50 ఎకరాల వరి తడిసిపోయింది
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన చింతపల్లి సత్యనారాయణ 50 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇటీవల పంటను కోసి ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టారు. గురువారం వచ్చిన అకాల వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. దీనిని పూర్తిగా ఆరబెట్టినా బస్తాకు రూ.400 వరకు ధర తగ్గిపోతుందని, దీని వల్ల ప్రతి ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు నష్టం తప్పదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిరప.. కళ్లెదుటే చెల్లాచెదురు
వేలేరుపాడు మండలం భూదేవిపేటకు చెందిన రైతు శెట్టిపల్లి రంగారావు ఈ ఏడాది 4 ఎకరాల్లో సాగు చేసిన మిరప తోటలో రెండు దఫాలుగా కాయలు కోసి సుమారు 20 క్వింటాళ్ల మిరపకాయలను కల్లంలో ఆరబోశారు. కరోనా దెబ్బకు విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతలోనే వచ్చిన గాలి వానతో కాయలన్నీ కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగింది. ఎకరాకు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టానని ఆయన ఆవేదన చెందుతున్నారు.
మామిడి పంట నేలపాలు
గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణ ఎకరం రూ.40వేల చొప్పున 10 ఎకరాల మామిడి తోటను కౌలుకు సాగు చేస్తున్నారు. పెట్టుబడి సుమారు రూ.లక్ష పెట్టారు. గురువారం తెల్లవారు జామున వచ్చిన గాలి దుమారానికి చెట్లకు ఉన్న కొద్దిపాటి కాయలు నేలరాలాయి. దీంతో సుమారు రూ. 2 లక్షలకు పైగా నష్టం వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
మొక్కజొన్న మొత్తం నేల వాలింది
టి.నరసాపురానికి చెందిన భీమవరపు సుబ్బారావు రెండెకరాల పొలంలో మొక్కజొన్న వేశారు. పెట్టుబడి రూ.50 వేలకు పైగా అయ్యింది. ప్రస్తుతం పంట గింజ పోసుకునే దశలో ఉంది. గురువారం పడిన వర్షంతో పంట మొత్తం నేలవాలింది. తీవ్రంగా నష్టపోయానని ఆయన ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడి వస్తుందన్న ఆశ లేదు
పోలవరానికి చెందిన రైతు కొత్తల బాలాజీ 18 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అందులో 12 ఎకరాల్లో పంట నేల వాలింది. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ. 1760 గా ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దళారులు రూ.1300 వంతున అడుగుతున్నారు. పెట్టిన పెట్టుబడి వస్తుందన్న ఆశ కనిపించడం లేదు. అకాల వర్షంతో అన్ని విధాలుగా నష్టపోయాం.
ఒడ్డుకు చేర్చేందుకు అదనపు ఖర్చు
దెందులూరు మండలం కొవ్వలికి చెందిన కౌలు రైతు కట్టా సత్యనారాయణ ఎకరానికి రూ. 30 వేలు వంతున వరి పంటకు ఖర్చుచేశారు. అయినా పంట బాగుందని సంతోషించారు. అకాల వర్షంతో అంతా పోయింది. పొలం నుంచి ఒడ్డుకు చేరడానికి రెండు ఎకరాలకు రూ. 12 వేలు ఖర్చు అదనమయ్యిందని వాపోతున్నారు.
ప్రతిపాదనలు పంపిస్తాం..
జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షానికి చాలా పంటలకు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలతో నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తామని జేడీఏ తెలిపారు. నష్టపరిహారం చెల్లింపునకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా అందలేదని గౌసియా బేగం చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యాన పంటలకు నష్ట పరిహారం చెల్లించే అవకాశం లేదని వెల్లడించారు.
ఇదీ చూడండి: