Crop Fields in Gunupudi area are Littered with Waste: పచ్చని పైరుతో కళకళలాడాల్సిన పంట పొలాలు వ్యర్థ జలాలతో నిండిపోతున్నాయి. దాళ్వా పంటకు నారుమళ్లు సిద్ధం చేసుకుంటూ కనిపించాల్సిన రైతులు.. పంట పండించే దారి లేక తలలు పట్టుకుంటున్నారు. ఏటా సిరులు కురిపిస్తూ అన్నదాత కళ్లలో ఆనందం నింపే ఆయకట్టు నిరుపయోగంగా మారడంతో.. కర్షకులు కలత చెందుతున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలవ్వాలా అంటూ పశ్చిమ గోదావరి జిల్లా రైతులు నిలదీస్తున్నారు.
పంట నష్టాన్నిఅంచనా వేయాలన్న ప్రభుత్వం - జంకుతున్న అధికారులు- జగన్ వ్యాఖ్యలే కారణమా?
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పరిధి గునుపూడి ప్రాంతంలోని పంట పొలాల పరిస్థితి రోజు రోజుకి మరింత దారుణంగా తయారవుతుంది. అధికారుల అలసత్వం కారణంగా పచ్చని పైరుతో కళకళలాడాల్సిన పొంట పొలాలు.. మురుగు, వ్యర్థాలతో నిండిపోయి బురద కయ్యల్లా మారిపోయాయి. ఈ పొలాలకు పక్కనే టిడ్కో గృహ సముదాయాలను నిర్మించగా.. అక్కడి నుంచి వచ్చే వ్యర్థ జలాలు నేరుగా పొలాల్లోకి చేరుతున్నాయి. వాస్తవానికి గృహ సముదాయంలో మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా వ్యర్థ జలాలను శుద్ధి చేయాల్సి ఉండగా.. ఈ గృహాల సముదాయంలో అలా జరగడం లేదు.
సాగునీరు లేక పంటను దున్నేసిన రైతు - మరోచోట నాలుగున్నర ఎకరాల పంట పశువులకు మేతగా
పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే హడావుడిగా లబ్దిదారులను తీసుకువచ్చి ఇళ్లు కేటాయించారు. దీంతో వారు వాడిన నీరంతా వ్యర్థాల రూపంలో రైతుల పంట పొలాల్లోకి చేరుతోంది. మురుగునీటి శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్టీపీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో నీటిని శుద్ధిచేసే అవకాశం లేకుండాపోయింది. ఫలితంగా గృహ సముదాయంలోని వ్యర్థ జలాలు రైతుల పొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కళ్లముందే సిరులు కురిపించే పొలాలు కలుషిత వ్యర్థాలతో నిండిపోవడంతో రైతులు సాగుకు దూరమవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే.. ఎప్పటికో స్పందించిన అధికారులు శాశ్వత పరిష్కారం చూపాల్సింది పోయి.. వ్యర్థ జలాలకు అడ్డుగా తాత్కాలికంగా మట్టిపోసి మమ అనిపించారు.
దీంతో టిడ్కో గృహ సముదాయాల్లోని నీరు ఎప్పటిలానే మళ్లీ రైతుల పొలాల్లోకి వచ్చి చేరుతోంది. ఈ నీరు భరించలేని దుర్వాసన వస్తోందని.. ఈ దుర్వాసన కారణంగా వ్యవసాయ కూలీలు సైతం ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. పంట పొలాలు ఉండి కూడా సాగు చేసుకునే అవకాశం లేక వదిలేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సుమారు 600 ఎకరాల్లో రైతులు ఈ దారుణ పరిస్థితి ఎదుర్కొంటుండగా.. 200 ఎకరాలు పూర్తిగా సాగుకు పనికిరాకుండా పోయిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణంలో ఉన్న ఎస్టీపీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. టిడ్కో గృహ సముదాయాల్లోని వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి కాకుండా మురుగునీటి కాలువలోకి మళ్లించేలా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.