మూసివేసిన పీచు తయారీ పరిశ్రమ
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్టే కొబ్బరి పీచు పరిశ్రమలపైనా పడింది. మూడింట ఒకవంతు మూతపడ్డాయి. ఎక్కువ శాతం పరిశ్రమలకు నిర్వహణ వ్యయం భారంగా మారింది. కరోనా ప్రభావంతో చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో కొన్ని పరిశ్రమలను సంబంధిత యజమానులు మూసివేశారు. జిల్లాలో 150 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉండగా సుమారు 50 పరిశ్రమల వరకు మూసివేశారు. సుమారు రూ.180 కోట్ల వరకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఇంతకాలం అతి కష్టమ్మీద పరిశ్రమలను నడుపుకొచ్చినా ధర లేకపోవడంతో కొన్ని పరిశ్రమలను మూసివేసి సంబంధిత యంత్రాలను పాత ఇనుము లెక్కన అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొన్ని పరిశ్రమల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పీచు పరిశ్రమ ఎక్కువగా కూలీలపై ఆధారపడి ఉంది. ఒక్కో పరిశ్రమలో 60 నుంచి 100 మంది కూలీలు పనిచేస్తుంటారు. అంటే జిల్లాలో సుమారు 9 వేల మంది కూలీలకు జీవనోపాధి కరవైంది.
జిల్లాలోని ఏలూరు, తణుకు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, యలమంచిలి, కానూరు తదితర ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా క్వాయర్ పరిశ్రమలున్నాయి. వీటిద్వారా నెలకు 10 నుంచి 15 వేల టన్నుల వరకు పీచు ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తులను విశాఖ ఓడ రేవు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు. కొబ్బరి పీచును ఎక్కువగా సోఫాసెట్లు, తివాచీలు, పరుపులు, తాళ్లు తయారుచేయడానికి వినియోగిస్తారు. కిలో తయారీకి రూ.12 ఖర్చయితే.. రూ.10కే కొనుగోలు చేస్తున్నందున నష్టం వాటిల్లుతోంది. విద్యుత్తు ఛార్జీలు, ఎగుమతులు చేయడానికి రవాణా ఖర్చులు భారంగా మారాయి.
పరిశ్రమను తీసేశా
ఎగుమతులు నిలిచిపోవడంతో పీచు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పరిశ్రమ ద్వారా ఏడాదికి రూ.7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు లావాదేవీలు జరిగేవి. ఉత్పత్తులను నిల్వ ఉంచుకొనే పరిస్థితి లేదు. నిర్వహణ భారమై పరిశ్రమను తీసివేయడంతో రూ.కోటి వరకు నష్టం వచ్చింది. క్వాయర్ పరిశ్రమ స్థానంలో రైస్ మిల్లు ఏర్పాటు చేశాను. - చిట్టూరి శ్రీవెంకటసుబ్బారావు, క్వాయర్ బోర్డు మాజీ సభ్యుడు, తణుకు
రుణాలు అందజేస్తున్నాం
విద్యుత్తు బకాయిలు పడిన పరిశ్రమలకు స్థిర విద్యుత్తు బిల్లుల కింద ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సంబంధిత యజమానులకు బిల్లులు వెనక్కి ఇస్తున్నాం. పరిశ్రమలు మూతపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ పథకం ద్వారా పరిశ్రమపై తీసుకున్న రుణాన్ని బట్టి ఎటువంటి పూచీకత్తు లేకుండా 20 శాతం రుణాలను బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందజేస్తున్నాం. చిన్నతరహా పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చి పరిశ్రమలు నడుపుకొనేందుకు ప్రోత్సహిస్తున్నాం. - కాకర్ల కృష్ణార్జునరావు, సహాయ సంచాలకులు, పరిశ్రమల శాఖ, కాకినాడ
ఇదీ చదవండి: