వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిపాలన పూర్తిగా స్తంభించిందని తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తమ హయాంలో నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశాలు కూడా చేయడం లేదని మండిపడ్డారు. తెదేపాకు పేరు వస్తుందన్న కారణంతోనే... ఇప్పటికే కట్టిన ఇళ్లను జనానికి కేటాయించడం లేదని అన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా రాజధానిని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన తెదేకా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో
చంద్రబాబు అన్నారు. అమరావతి రూపంలో ఉన్న బంగారుబాతును చంపేశారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ దృష్టి పడితే ఏ పనైనా నాశనం కావాల్సిందేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు అసహ్యించుకొనే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. సీఎం ఏ పనీ చేయకుండా ఉండి ఉన్నా... కీలక ప్రాజెక్టులు పూర్తై రాష్ట్రానికి మేలు జరిగి ఉండేదన్నారు. గోదావరిలో బోటు వెలికితీసిన ధర్మాడి సత్యం పట్టుదలలో ఒక్క శాతం కూడా జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు.
పీపీఏల విషయంలో గత ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో తలపెట్టిన నదుల అనుసంధానాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు పడినా జలాశయాలు, కాల్వలు నింపలేకపోయారని ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయాలపైనా వైకాపా రంగులు వేస్తున్నారని ఆగ్రహించారు.
ఇదీ చదవండి