తెదేపా ప్రభుత్వం హయాంలో రాష్ట్రాన్ని అన్నింటా నెంబర్‌వన్‌గా నిలిపామని... ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇప్పుడు కొత్తగా నాడు-నేడు పేరుతో పాఠశాలలకు వైకాపా రంగులు వేస్తారా..? అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మూడోరోజు పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని విమర్శించారు. అహర్నిశలు శ్రమించి 71 శాతం పోలవరం పనులను తెదేపా పూర్తి చేస్తే... మిగిలిన 29 శాతం పనిచేసేందుకు నానాతంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం పనుల వల్ల పోలవరం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని కట్టకుంటే తెలుగుజాతికి నష్టం..
ప్రభుత్వం వచ్చి 6 నెలలవుతున్నా పాలన కనిపించడం లేదని చంద్రబాబు విమర్శించారు. సంపద సృష్టించకుంటే రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. తెదేపా హయాంలో వృద్ధిరేటు బాగా పెంచామని గుర్తుచేశారు. తెదేపా హయాంలోనే పాఠశాలల అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడు 'నాడు-నేడు' పేరుతో అన్నింటికీ వైకాపా రంగులు వేస్తారా...? అని ప్రశ్నించారు. రూపాయి ఖర్చు లేకుండా రాజధాని నిర్మించుకునే ప్రాజెక్టు అమరావతి అని ఆయన వివరించారు. తమ విధానాలను పాటిస్తే ప్రపంచస్థాయి నగరంగా అమరావతి మారేదని స్పష్టం చేశారు. కష్టపడి సింగపూర్ ప్రభుత్వం లాంటి భాగస్వామిని తీసుకొస్తే... వైకాపా ప్రభుత్వం వారిని వెళ్లగొట్టిందని మండిపడ్డారు. ప్రపంచం అంతా ఛీ కొట్టే పరిస్థితి తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. రాజధాని కట్టకుంటే తెలుగుజాతి నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి