శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో.. అమరావతి కోసం ప్రజలు ఉద్యమించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రంలో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన... భీమవరంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దిల్లీలో కార్యాలయాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఒకచోటే పెడుతుందని... రాష్ట్రంలో మాత్రం మూడు చోట్ల పెడతామని అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌కు భయపడి రాజధానులపై పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదని విమర్శించారు. 3 రాజధానులు వద్దని జిల్లా వైకాపా నేతలంతా జగన్‌కు చెప్పాలని హితవు పలికారు. రాజధాని రైతులను నాశనం చేసి మరోచోట రైతులను ఉద్ధరిస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 3 రాజధానులు పెడితే రైతులకు ఎకరాకు రూ.10 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని... అంత ఇవ్వగలరా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. విశాఖ ప్రజలపై వైకాపా నేతలకు అభిమానం లేదని.... విశాఖలోని భూములపైనే వాళ్లకు ప్రేమ అని చంద్రబాబు ఆరోపించారు.
ఇదీ చదవండి: