పోలవరం జాతీయ ప్రాజెక్టు(Polavaram project)కు ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపినట్లు(Polavaram project) సమాచారం. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రమూ అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి నీటిని మళ్లించేందుకు... అక్కడ అవసరమైన మట్టి తవ్వకం తదితర పనులు సాగుతున్నాయి. వాటికయ్యే వ్యయం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్రం వాదిస్తోంది.
మట్టి తవ్వకానికి గతంలోనే ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక ఇచ్చిన ప్రతి పైసాపై కేంద్రం పరిశీలన జరుపుతోంది. 2014 ఏప్రిల్ ఒకటి నాటికి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సాగునీటి విభాగం కింద రూ.20,398.61 కోట్లు ఖర్చవుతుందని లెక్క తేల్చింది. అందులో ఏయే విభాగాల కింద ఎంత మొత్తం అవుతుందని లెక్కించి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందో అంతకుమించి ఒక్క పైసా ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. పైగా గతంలో ఆయా విభాగాల కింద ఏయే నిధులు ఇచ్చారు... అవి ఈ డీపీఆర్ పరిధిలోకి వస్తాయా రావా అన్న విషయాన్నీ కేంద్రం లోతుగా పరిశీలిస్తోంది.
మట్టి తవ్వకం బిల్లుల తిరస్కరణ!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ప్రతిపైసా కేంద్రం(central on Polavaram project) ఇస్తుందని విభజన చట్టం పేర్కొంటోంది. మరోవైపు తాజా ధరల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. కమిటీల పరిశీలనా పూర్తయింది. ఈ మొత్తానికి పెట్టుబడి వ్యయం ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించి నిధులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. మరోవైపు పోలవరం నిధులు ఎలా కోత పెట్టాలా అనేదానిపై కసరత్తు జరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. పోలవరం విద్యుత్కేంద్రం మట్టి తవ్వకానికి సంబంధించి తాజాగా సమర్పించిన రూ.208 కోట్ల బిల్లులూ తిరస్కరణకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో బుడమేర మళ్లింపు, తదితర పనులకు ఇచ్చిన నిధులు కోత పెట్టుకుంటామంటూ కేంద్రం మెలిక పెడుతోంది. కుడికాలువ ద్వారా నీళ్లు మళ్లించాలంటే బుడమేరు పనులు చేయాల్సిందేనని, అవి పోలవరంలో భాగమేనని రాష్ట్ర అధికారులు వాదిస్తున్నారు.
- పోలవరం విద్యుత్కేంద్ర నిర్మాణానికి రూ.3,529.33 కోట్లే ఖర్చవుతాయని డీపీఆర్ లెక్కలు పేర్కొంటున్నాయి. విద్యుత్కేంద్రం ఖర్చురూపంలో రూ.4,560.91 కోట్లు మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. ఆ తేడా రూ.1,031.58 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. 2020 అక్టోబరు నుంచి పోలవరం నిధులపై కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ వివాదాలు పరిష్కారం కాక పోలవరానికి నిధుల విడుదల పెద్ద సమస్యగా మారింది.
తాగునీటి విభాగం నిధులివ్వాల్సిందే...
పోలవరం ప్రాజెక్టులో తాగునీటి విభాగం కింద కోత పెట్టిన రూ.4,068.43 కోట్లు ఎందుకు ఇవ్వాలో తెలిపేలా కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ రాయబోతోంది. ఈ నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలవనరుల శాఖ సిఫారసు చేసినా ఆర్థికశాఖలోని వ్యయ విభాగం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈమధ్య దీనిపై జలవనరుల శాఖలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. అధికారులు తమ వాదనను సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి..
MINISTERS ON CHANDRABABU: సీఎంపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన: మంత్రులు