Village secretariats: సచివాలయాల్లో మౌలిక వసతుల ఖర్చు.. గ్రామ పంచాయతీలపై పడింది. సచివాలయాలకు కొనుగోలుచేసిన కంప్యూటర్లు, ప్రింటర్ల బిల్లులు చెల్లించాలని.. పంచాయతీలకు ఆదేశాలందాయి. పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి.. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యదర్శులకు ఈ మేరకు ఉత్తర్వులు పంపారు. గతంలో సచివాలయాల కోసం రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్ కొనుగోలు చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ నిధులతో వీటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖకు తిరిగి నిధులు జమ చేసేందుకు.. గ్రామపంచాయతీలు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. కంప్యూటర్‌కు రూ.38,965, ప్రింటర్‌కు రూ.10,943.. గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక సచివాలయం ఉన్న గ్రామపంచాయతీలయితే.. రూ.51వేలు బిల్లులు జమ చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ సచివాలయాలు ఉన్న గ్రామపంచాయతీలకు ఈ భారం మరింత పెరగనుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో 909గ్రామ పంచాయతీలుండగా.. మొత్తం 938 సచివాలయాలున్నాయి. వీటి కోసం రూ.4కోట్ల 68 లక్షలు వెచ్చించి 1,876 కంప్యూటర్లు, 938 ప్రింటర్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఇంటర్‌నెట్ బిల్లులు.. ఇతర నిర్వహణ భారం పంచాయతీలు భరిస్తుండటం వల్ల.. నిధుల్లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని స్థానికులు వాపోతున్నారు. సచివాలయాల భారాన్ని తీసివేసి.. గ్రామ పంచాయతీలకు మరిన్ని నిధులు కేటాయించాలని సర్పంచులు, ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
నంద్యాల కలెక్టరేట్ భవన పరిశీలన... కొత్త జిల్లా పనులు వేగవంతం